అక్కడ ఇండ్లు ఫుల్.. లబ్ధిదారులు నిల్!  బాచారం, బాటసింగారంలో ఖాళీగా1600 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్

అక్కడ ఇండ్లు ఫుల్.. లబ్ధిదారులు నిల్!  బాచారం, బాటసింగారంలో ఖాళీగా1600 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్
  •  ఫ్లాట్స్ ఇద్దామంటే లబ్ధిదారులు లేరంటున్న హౌసింగ్ ఆఫీసర్లు
  •  3 నుంచి 5 కిలోమీటర్లలోపు వారికే కేటాయించాలని రూల్
  •  7 కిలోమీటర్లలోపు సైతం లేరని ఉన్నతాధికారులకు రిపోర్ట్
  •  వచ్చే కేబినెట్ లో నిబంధనల్లో సవరణలు 

హైదరాబాద్, వెలుగు : ఇండ్లు లేని పేదలకు ఇచ్చేందుకు గత ప్రభుత్వం డబుల్ బెడ్‌‌‌‌ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. కానీ, కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తికాకుండా అలాగే ఉన్నాయి. అలాంటి ఇండ్లను కాంగ్రెస్​ ప్రభుత్వం పెండింగ్​ వర్క్స్​ పూర్తి చేయించి నిరుపేదలకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. కాగా, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉన్న దగ్గర 3 నుంచి 5 కిలోమీటర్ల లోపు నివసిస్తున్న పేదలకు మాత్రమే ఆ ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఫ్లాట్లు ఫుల్​గా ఉన్నాయి.. కానీ, వాటిని ఇద్దామంటే మాత్రం లబ్ధిదారులు దొరకడం లేదు. 

1,600 డబుల్ బెడ్‌‌‌‌రూమ్ ఫ్లాట్లు ఖాళీగా.. 

రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్ మండలం బాచారం, బాటసింగారం ( ఓఆర్ ఆర్ బయట, రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ) ప్రాంతాల్లో ప్రభుత్వం 1,600 డబుల్ బెడ్‌‌‌‌రూమ్ ఫ్లాట్లు లబ్ధిదారుల కోసం సిద్ధం చేసింది. కానీ నిబంధనల మేరకు లబ్ధిదారులు లేరన్న కారణంతో ఈ ఫ్లాట్లు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. రూల్స్​ ప్రకారం.. ఆయా ఈ ఫ్లాట్లకు ఐదు కిలోమీటర్ల పరిధిలో లబ్ధిదారులు ఎవరూ లేరని తేలింది. దీంతో నిబంధనను ఏడు కిలోమీటర్ల పరిధి పెంచినా లబ్ధిదారులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. 

హౌసింగ్ అధికారుల నివేదిక.. 

బాచారం, బాటసింగారం ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లకు లబ్ధిదారులు దొరకని విషయమై హౌసింగ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను అందజేశారు. ప్రస్తుతం ఉన్న రూల్స్​ప్రకారమే అయితే ఈ ఫ్లాట్లన్నీ నిరుపయోగంగా మారనున్నాయని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్రం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.   
 
రూల్స్ సడలింపుపై కసరత్తు!

స్థానికంగా లబ్ధిదారులు లేని నేపథ్యంలో ఫ్లాట్ల కేటాయింపు నిబంధనను సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో 3 నుంచి 7 కిలోమీటర్లకు పైగా పరిధి అంశాన్ని పరిశీలిస్తోంది. ఇదే సమస్య మరి కొన్ని నియోజకవర్గాల్లో సైతం ఉందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.  రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ డబుల్ బెడ్‌‌‌‌రూమ్ ఇండ్ల కేటాయింపు నిబంధనల సవరణపై చర్చించి, ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి కేబినెట్ ఆమోదం లభించగానే అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ ఫ్లాట్లను అందచేయనున్నారు.