కోఠి, వెలుగు: సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు చేస్తున్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లను పోలీసులు అరెస్ట్ చేయడంతో కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆఫీస్వద్ద ఉద్రిక్తత నెలకొంది. 34 రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ వైద్యశాఖ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన గ్రాడ్యుయేట్లు., డీఎంఈ ఆఫీసర్లను కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పలువురికి గాయాలైనట్లు తెలిసింది.
ఈ సందర్భంగా డాక్టర్లు శశాంక్, వైష్ణవి, శ్రీకర్, మోసీన్ మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కేంద్ర నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నామని తెలిపారు. అయినా తమకు నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్ మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులకు నెలకు రూ.29 వేల స్టైపెండ్ ఇస్తున్నారని, ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు తమకు కూడా సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను విదేశాల్లో అభ్యసించామనే కారణంతో వివక్ష చూపడం తగదన్నారు. 34 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ఆఫీసర్లు చర్చలకు ముందుకు రావడంలేదని విమర్శించారు. ప్రభుత్వం, వైద్యశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు.
