హైదరాబాద్, వెలుగు: తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలకు ఎర్రజెండా అండగా ఉంటుందని, పాలకులు దిగొచ్చి వారి సమస్యలను పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. ఆదివాసీలకు తక్షణమే ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు, పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివాసీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద జరిగిన బహిరంగ సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. ఆదివాసీలు అడవుల్లో ఒకచోట నుంచి మరోచోటుకు వలస వెళ్లడం సహజమన్నారు. వారిని తమ వారు కాదని ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు.
మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ.. ఆదివాసీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సిన బాధ్యత మంత్రి సీతక్కపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు వలస ఆదివాసీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ మాట మార్చడం తగదన్నారు.
