మణుగూరు: చేతబడి అనుమానంతో ఇద్దరి దారుణ హత్య..35 రోజుల తర్వాత మృతదేహాల వెలికితీత

మణుగూరు: చేతబడి అనుమానంతో ఇద్దరి దారుణ హత్య..35 రోజుల తర్వాత మృతదేహాల వెలికితీత
  •     భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఘటన 

మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరి హత్య కలకలం రేపింది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఐదుగురు వ్యక్తులు ఇద్దరిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెలలో అదృశ్యమైన వీరి మృతదేహాలు ఆళ్లపల్లి మండలం మల్లేపల్లి చెక్‌‌‌‌డ్యామ్ సమీపంలో ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, మట్టిలో పాతిపెట్టిన స్థితిలో లభ్యమయ్యాయి. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లోని సుక్మా జిల్లాకు చెందిన పద్దం మాసయ్య (40) మణుగూరు మండలం బుడుగుల, మడకం భీమా (70) ఆళ్లపల్లి మండలం బుసురాయిలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. 

మాసయ్య కొడుకు రాంబాబు కూతురు అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం గత నెల 4న భీమాను రాంబాబు బుడుగుల గ్రామానికి తీసుకొచ్చాడు. రెండు రోజుల తర్వాత, 6వ తేదీన మాసయ్య భీమాను బుసురాయి గ్రామానికి తీసుకెళ్లగా ఇద్దరూ అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. నాలుగు రోజుల కింద మల్లేపల్లి చెక్‌‌‌‌డ్యామ్ సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో మట్టిలో పాతిపెట్టిన ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. భీమా కుమార్తె ఎట్టి నందిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఐదుగురు ఈ హత్యలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.