బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 15వ ఎల్‌ఏసీఎంఏ ఆర్ట్ + ఫిల్మ్ గాలాకు ఆయన హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైన తొలి భారతీయ నటుడిగా హృతిక్ చరిత్ర సృష్టించారు. భారత సంతతికి చెందిన నిర్మాత కవితా గుప్తా ఈ వేడుకలో హృతిక్‌ను హోస్ట్ చేశారు. హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మాన్, ‘డ్యూన్’ చిత్ర దర్శకుడు డెనిస్ విల్లెన్యూవ్‌లతో హృతిక్ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ‘బ్రునెల్లో కుసినెల్లి’ డిజైన్ చేసిన డార్క్ బ్లూ టక్సెడోలో హాజరైన హృతిక్ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీకి డెనిస్ విల్లెన్యూవ్ డైరెక్ట్ చేయనుండటం, త్వరలో జేమ్స్ బాండ్ ఎవరనేది రివీల్ చేయనుండడంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ వేడుకలో డెనిస్, హృతిక్ కలిసి ఫొటో దిగిన నేపథ్యంలో.. ‘డెనిస్.. అసలైన జేమ్స్ బాండ్ మీతోనే ఉన్నాడు.. దయచేసి అతన్ని జేమ్స్ బాండ్‌గా తీసుకోండి’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరైతే బాండ్ ఐకానిక్ స్టిల్‌లో హృతిక్ ఫొటోస్‌ను మార్ఫింగ్ చేసి, ‘ధూమ్’ సిరీస్ వీడియోలను ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. బాండ్ క్యారెక్టర్‌కు తగ్గ ఆకర్షణీయమైన రూపం, యాక్షన్ సీన్స్‌లో నటించిన సామర్థ్యం లాంటివన్నీ చూస్తే హృతిక్ ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అంటున్నారు నెటిజన్స్. మరి ఆ అవకాశం హృతిక్‌ను వరిస్తుందేమో చూడాలి!
