సోనియాగాంధీ ఆత్మకథ: జీవితంలో అత్యంత బాధాకరం

సోనియాగాంధీ ఆత్మకథ: జీవితంలో అత్యంత బాధాకరం

2002 నాటి గుజరాత్ అల్లర్లు తనను ఎంతో బాధపెట్టాయని సోనియా గాంధీ తన ఆత్మకథలో రాశారు. అల్లర్ల అనంతరం అఖిలపక్ష ప్రతినిధి బృందంతో కలిసి అహ్మదాబాద్‌‌లోని సహాయక శిబిరాలను సోనియా సందర్శించారు. అక్కడ నిరాశ్రయులు, భయంతో వణికిపోతున్న పిల్లలతో వాతావరణం ఎంతో భయానకంగా ఉందని ఆమె గుర్తుచేసుకున్నారు. రోడ్లపై యువకుల గుంపులు మతపరమైన నినాదాలు చేస్తూ ఉద్రిక్తతను సృష్టించాయి. ఆ టైంలో అధికారులను కలిసినా ఎలాంటి స్పందన లేదు. 

బాధితులు తలదాచుకున్న ఒక శిబిరాన్ని సందర్శించినప్పుడే తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం ఎదురైందని సోనియా తెలిపారు. "ఆ శిబిరంలోకి తాను ప్రవేశించగానే.. ఓ బక్కపలుచని పొడువైన వ్యక్తి తన చేతుల్లో స్పృహ కోల్పోయిన యువతిని పట్టుకుని ముందుకు వచ్చాడు. ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. "ఇది నా బిడ్డ. ఈ రాక్షసులు నా పాపపై మళ్లీ మళ్లీ అత్యాచారం చేశారు. నేను ఏం చేయాలి? దేవుడా మాకు సహాయం చేయ్" అని ఆర్తనాదాలు చేశాడ" అని సోనియా రాసుకొచ్చారు. 

తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణమని చెప్పారు. ఆ దృశ్యం చూసి తాను పూర్తిగా షాక్‌‌కు గురయ్యానన్నారు. అయోధ్య నుంచి వస్తున్న సబర్మతి ఎక్స్‌‌ప్రెస్ రైలు దహనం కావడంతో అల్లర్లు చెలరేగాయని, ఆ తర్వాత జరిగిన అరాచకాల్లో అత్యధికంగా ముస్లింలే బలయ్యారని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో గుజరాత్ సీఎంగా  నరేంద్ర మోదీ ఉన్నారని, ఆ మారణహోమాన్ని ఆపడంలో ఆయన యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సోనియా ఆరోపించారు. ఆ టైంలో అటల్ బిహారీ వాజ్‌‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నారని, ఆయన మోదీని తొలగిస్తారని అంతా భావించినప్పటికీ పార్టీ అంతర్గత ఒత్తిళ్ల వల్ల అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. ---