నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 720 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు భర్తీచేయనున్నారు. అక్టోబర్‌ 13న సంక్షిప్త ప్రకటన విడుదల కాగా.. నవంబర్‌ 10 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.తొలుత 686 పోస్టులతో సంక్షిప్త ప్రకటన విడుదల చేయగా.. తాజాగా ఖాళీల సంఖ్యను 720కి పెంచింది. వీటిలో 471 ఎగ్జిక్యూటివ్‌, 249 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉన్నాయి. 

పోస్టుల వివరాలు..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులు 203, డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు 176 ఉన్నాయి. వీటితో పాటు గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (GST) ఆఫీసర్‌ పోస్టులు 40, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 29 భర్తీ చేయనున్నారు. ఇతర శాఖల్లోనూ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, అకౌంటెంట్లు, మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ రిజిస్ట్రార్ల పోస్టులు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

  • పూర్తి నోటిఫికేషన్‌ విడుదల: నవంబర్‌ 10
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్‌ 10
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 11
  • ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 21, 2027

విద్యార్హతలు, వయోపరిమితి..

చాలా పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. అయితే పోస్టును బట్టి ప్రత్యేక విద్యార్హతలు అవసరం. ఆర్థిక శాఖ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులకు మ్యాథమెటిక్స్‌, ఎకనామిక్స్‌ లేదా కామర్స్‌ డిగ్రీ, న్యాయశాఖ పోస్టులకు లా డిగ్రీ అవసరం. అకౌంటెంట్‌ పోస్టులకు సంబంధిత డిగ్రీతో పాటు నిర్దేశించిన కంప్యూటర్‌ అర్హతలు ఉండాలి.

ALSO READ : ప్రైవేటు ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.3000..

2026 జూలై 1 నాటికి వయసును పరిగణనలోకి తీసుకుంటారు. చాలా పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల వరకు వయోపరిమితి ఉండగా, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ప్రత్యేక వయోపరిమితి వర్తిస్తుంది. కేటగిరీల వారీగా వయో సడలింపులు ఉంటాయి. 

ఎంపిక విధానం..

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. మొదట స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆ తర్వాత మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. అవసరమైన పోస్టులకు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ కూడా ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిపఇకేషన్  చేస్తారు. ఫిబ్రవరి 21న నిర్వహించనున్న స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆఫ్‌లైన్‌ ఓఎంఆర్‌ విధానంలో ఉంటుంది. మెయిన్స్‌ పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. 

దరఖాస్తు విధానం..

అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (OTPR) పూర్తి చేసి, తర్వాత గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ద్వారా అప్లికేషన్‌ సమర్పించాలి. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌లోని విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు వివరాలు, ఇతర నిబంధనలను పరిశీలించాలి.