2 వేల ఏళ్ల క్రితమే కంప్యూటర్‌ను గ్రీకులు కనిపెట్టారా..! : సముద్రంలో దొరికిన ఆ అద్భుత యంత్రం ఏంటీ..?

2 వేల ఏళ్ల క్రితమే కంప్యూటర్‌ను గ్రీకులు కనిపెట్టారా..! : సముద్రంలో దొరికిన ఆ అద్భుత యంత్రం ఏంటీ..?

సుమారు 2,100 ఏళ్ల క్రితం మనుషులు కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు లేని కాలంలోనే ఒక అద్భుతమైన యంత్రాన్ని తయారుచేశారు. ఆ యంత్రం సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఆకాశంలో ఎక్కడ ఉంటాయి ? అవి ఎప్పుడు కదులుతాయి ? ఎప్పుడు గ్రహణం ఏర్పడుతుంది ? వంటి విషయాలను లెక్కించగలిగేది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! ఇంతకీ ఆ యంత్రం ఏంటి ? దాన్ని ఎవరు తయారుచేశారు ? అసలు అది ఎలా పనిచేసేదంటే ?

ఆ యంత్రం పేరే యాంటికిథెరా మెకానిజం (Antikythera Mechanism). దీన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అనలాగ్ కంప్యూటర్‌గా చాలామంది అభివర్ణిస్తారు. ఎందుకంటే మనం ఈరోజు కాలిక్యులేటర్‌లో ఒక లెక్క వేస్తే అది సమాధానం చెప్పినట్లే, ఈ యంత్రంలో ఒక తేదీని సెట్ చేసి హ్యాండిల్‌ను తిప్పితే, లోపల ఉన్న గేర్లు కదులుతూ ఖగోళానికి సంబంధించిన లెక్కలను చూపించేవి.

అసలు ఈ యంత్రం ఏం చేసేది?
ఈ యంత్రం లోపల చాలా చిన్న చిన్న కంచు గేర్లు ఒకదానితో ఒకటి కలిపి అమర్చబడి ఉండేవి. మనం గడియారంలో ముళ్లు ఎలా తిరుగుతాయో చూశాం కదా! దాదాపు అదే విధంగా ఇందులోని గేర్లు కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేసేవి. ఈ యంత్రం ద్వారా ముఖ్యంగా సూర్యుడు ఆకాశంలో ఏ స్థానంలో ఉంటాడు? చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడు? చంద్రుడి దశలు ఎలా మారుతాయి? అంటే పౌర్ణమి, అమావాస్య ఎప్పుడు వస్తాయి? సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడతాయి? అనే  విషయాలను తెలుసుకోవచ్చు. 

ఇంకా... కొన్ని గ్రహాలు ఆకాశంలో ఎక్కడ ఉంటాయి? ప్రాచీన గ్రీకుల ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు జరుగుతాయి? అంటే ఆ కాలంలోనే ఆకాశంలో జరిగే అనేక మార్పులను ముందుగానే లెక్కించే సాంకేతికతను గ్రీకులు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఇది కేవలం సమయం చూపించే గడియారం కాదు. ఖగోళంలో జరిగే మార్పులను లెక్కించే ఒక యాంత్రిక పరికరం.

ఈ యంత్రం ఎందుకు అంత ప్రత్యేకమైనది?
1901కు ముందు చాలామంది చరిత్రకారులు ప్రాచీన గ్రీకులకు గేర్ల తయారీలో అంతటి నైపుణ్యం లేదని భావించేవారు. వారు గాలిమరలు, నీటిమరల్లో ఉపయోగించే సాధారణ గేర్లు మాత్రమే తయారుచేయగలరని అనుకునేవారు. కానీ యాంటికిథెరా యంత్రం బయటపడిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోయింది.

ఎందుకంటే ఇందులో చాలా క్లిష్టమైన గేర్ల వ్యవస్థ ఉంది. కొన్ని గేర్లు ఒకదానిపై మరొకటి పనిచేసేలా అమర్చబడి ఉన్నాయి. వీటిని ఎపిసైక్లిక్ గేర్లు అంటారు.వాటిలోని పళ్లను కూడా చాలా సన్నగా, దాదాపు ఒక మిల్లీమీటర్ పరిమాణంలో చెక్కారు. ఇంత చిన్న చిన్న భాగాలను 2,000 సంవత్సరాల క్రితమే అంత ఖచ్చితంగా తయారుచేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకుడు టోనీ ఫ్రీత్ దాదాపు 25 సంవత్సరాలుగా ఈ యంత్రంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ యంత్రం ఎంత అద్భుతంగా ఉందో చెబుతూ, దాని నైపుణ్యం దాదాపు నమ్మశక్యం కానిదని పేర్కొన్నారు.

ఇలాంటి యంత్రాలు అప్పట్లో చాలానే ఉండేవా?
న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ప్రాచీన విజ్ఞాన చరిత్ర పరిశోధకుడు అలెగ్జాండర్ జోన్స్ అభిప్రాయం ప్రకారం, ఇలాంటి యంత్రాలు అప్పట్లో అందరికీ అందుబాటులో ఉండేవి కావు. వీటిని తయారుచేయడానికి చాలా ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం. క్రీ.పూ. 100 ప్రాంతంలో ఇలాంటి యంత్రాలను తయారుచేయగలిగే నైపుణ్యం ఉన్న ప్రత్యేక వర్క్‌షాపులు ఉండేవని ఆయన భావిస్తున్నారు. ఒక్క యంత్రాన్ని తయారుచేయడానికి కూడా కొన్ని నెలల సమయం పట్టి ఉండవచ్చు. అంతేకాదు, వీటిని కొనుగోలు చేయగలిగినవారు కూడా చాలా తక్కువ మందే ఉండేవారు.

మరి అలాంటి యంత్రాలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు?
ఆ కాలంలో ఒక యంత్రం పాడైపోతే దాన్ని పారేసే బదులు, అందులో ఉన్న కంచు వంటి విలువైన లోహాలను తీసి మళ్లీ ఉపయోగించేవారు. అందువల్ల ఇలాంటి యంత్రాలు కాలక్రమంలో కనుమరుగైపోయాయి. అయితే ఒక యంత్రం మాత్రం అనుకోకుండా సముద్రంలో మునిగిపోయిన ఓడలో ఉండిపోవడం వల్ల మనకు దొరికింది. 

ఈ యంత్రం బయటపడిన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్రీ.పూ. 60 ప్రాంతంలో గ్రీకు దేశంలోని క్రీట్ ద్వీపం సమీపంలో ఒక పెద్ద ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ ఓడ దాదాపు 2,000 సంవత్సరాల పాటు సముద్రం అడుగునే ఉండిపోయింది. 1900 సంవత్సరంలో సిమి ప్రాంతానికి చెందిన కొంతమంది స్పాంజ్ డైవర్లు ఉత్తర ఆఫ్రికా వైపు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో తుఫాను రావడంతో యాంటికిథెరా ద్వీపం దగ్గర ఆశ్రయం పొందారు. తుఫాను తగ్గిన తర్వాత వారు సముద్రంలో స్పాంజ్‌ల కోసం వెతుకుతూ డైవింగ్ చేశారు. అప్పుడు వారికి సముద్రం అడుగున ఒక పురాతన ఓడ శిథిలాలు కనిపించాయి.

మొదట ఒక డైవర్ నీటి అడుగున కనిపించిన ఆకారాలను చూసి అవి మనుషుల శవాలని భయపడ్డాడని చెబుతారు. కానీ దగ్గరగా చూసిన తర్వాత అవి పాలరాతితో చేసిన పురాతన విగ్రహాలని తెలిసింది. ఈ విషయం గ్రీకు ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి డైవర్లను నియమించింది. దొరికిన వస్తువులను ఎవరూ దొంగిలించకుండా ఒక గన్‌బోట్‌ను కూడా కాపలాగా ఉంచింది. ఆ రోజుల్లో డైవింగ్ చేయడం ఇప్పుడు ఉన్నంత సులభం కాదు. డైవర్లు భారీ హెల్మెట్లు, కాన్వాస్ దుస్తులు ధరించి సముద్రంలోకి వెళ్లేవారు. వారు ఒకసారి నీటి అడుగున సుమారు ఐదు నిమిషాలే ఉండగలిగేవారు. అయినా వారు చాలా విలువైన వస్తువులను బయటకు తీశారు.

వాటిలో పాలరాతి విగ్రహాలు, గాజు వస్తువులు, ఫర్నిచర్, మట్టి పాత్రలు, పురాతన నాణేలు, బంగారు చెవిపోగులు  వంటి  విలువైన వస్తువులు బయటపడటంతో అప్పట్లో పత్రికలన్నీ ఆ విగ్రహాల గురించే వార్తలు రాశాయి. కానీ ఒక చిన్న, తుప్పు పట్టిన లోహపు ముద్దను మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అదే ప్రపంచ చరిత్రలో గొప్ప ఆవిష్కరణల్లో ఒకటిగా నిలిచిన యాంటికిథెరా మెకానిజం!

ఓడలో దొరికిన వస్తువులన్నింటినీ ఏథెన్స్‌లోని నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియానికి తీసుకువచ్చారు. అయితే ఆ తుప్పు పట్టిన లోహపు ముద్ద గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. 1902లో గ్రీకు పురావస్తు శాస్త్రవేత్త వాలెరియోస్ స్టైస్ ఆ లోహపు ముక్కలను పరిశీలిస్తున్నప్పుడు వాటిలో విచిత్రమైన గేర్లు కనిపించాయి. అవి సాధారణమైన లోహపు ముక్కలు కావని ఆయన గుర్తించారు. లోపల గడియారంలో ఉండే గేర్లలాంటి భాగాలు కనిపించాయి. అప్పుడే పరిశోధకులకు ఆ వస్తువు ఎంత ప్రత్యేకమైనదో అర్థం కావడం మొదలైంది. తర్వాత అనేక సంవత్సరాల పాటు శాస్త్రవేత్తలు దానిపై పరిశోధనలు చేశారు.

ఇప్పటివరకు చేసిన పరిశోధనల ప్రకారం, ఈ యంత్రం క్రీ.పూ. రెండో శతాబ్దం చివరి కాలం లేదా మొదటి శతాబ్దం ప్రారంభ కాలానికి చెందినదిగా భావిస్తున్నారు. సుమారుగా క్రీ.పూ. 205 నుంచి 60 మధ్యకాలంలో తయారై ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ఒక అడుగు కంటే కొంచెం ఎక్కువ ఎత్తు ఉండేలా, చెక్క పెట్టెలో అమర్చబడి ఉండేదని అంచనా.

ఈ యంత్రం ఇప్పటికీ ఎందుకు అంత ముఖ్యమైనది?
ఈ యంత్రం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా మనం చరిత్రను చదివేటప్పుడు పాత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువగా ఉండేదని అనుకుంటాం. కానీ యాంటికిథెరా మెకానిజం ఆ ఆలోచనను మార్చేసింది. 2,000 సంవత్సరాల క్రితమే మనుషులు గ్రహాల కదలికలను అర్థం చేసుకుని, వాటిని లెక్కించడానికి ఇంత క్లిష్టమైన యంత్రాన్ని తయారుచేయగలిగారు. అంతేకాదు, ఈ యంత్రం మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెబుతోంది. సాంకేతికత ఎప్పుడూ ఒకే దిశలో ముందుకు సాగదు.

ఈరోజు మన దగ్గర ఉన్న సాంకేతికత రేపు మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక నాగరికత సాధించిన అద్భుతమైన పరిజ్ఞానం తర్వాతి తరాలకు అందకుండా పోవచ్చు. ప్రాచీన గ్రీకులు ఇంతటి అద్భుతమైన యంత్రాన్ని తయారుచేశారు. కానీ ఆ తర్వాత అనేక శతాబ్దాల పాటు ఇలాంటి యంత్రానికి సమానమైన పరికరం మనకు కనిపించలేదు. దీని అర్థం ఏమిటంటే, ఒకప్పుడు మనుషులు సాధించిన గొప్ప జ్ఞానం కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు. ఈరోజు కూడా శాస్త్రవేత్తలు యాంటికిథెరా యంత్రంలోని ప్రతి చిన్న భాగాన్ని పరిశీలిస్తూ, దాని పనితీరును పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. కంప్యూటర్లు, విద్యుత్ లేని కాలంలోనే,  సుమారు 2,100 సంవత్సరాల క్రితం మనుషులు సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలను లెక్కించగలిగే ఒక యంత్రాన్ని తయారుచేశారు. అది ఎలా పనిచేసేదో తెలుసుకోవడానికి మనకు దాదాపు 2,000 సంవత్సరాలు పట్టింది. ఒకవేళ ఆ ఓడ సముద్రంలో మునిగిపోకుండా ఉండి ఉంటే, లేదా ఆ తుప్పు పట్టిన యంత్రాన్ని ఎవరో కరిగించి లోహంగా మార్చి ఉంటే, ఇలాంటి అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం గురించి మనకు తెలిసేదే కాదు. అంటే మన చరిత్రలో మనకు తెలియని ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు ఇంకా సముద్ర గర్భంలోనో, భూమి అడుగునో దాగి ఉండవచ్చు!