అలుపెరగని జంతు ప్రేమికుడు.. చిన్న తోపుడు బండితో.. రోజూ 300 వీధి జంతువుల కడుపు నింపుతున్న కూలీ!

అలుపెరగని జంతు ప్రేమికుడు.. చిన్న తోపుడు బండితో.. రోజూ 300 వీధి జంతువుల కడుపు నింపుతున్న కూలీ!

అతడు ఒక రోజు కూలీ. సిటీలో ఉన్న వీధి జంతువుల బాధ్యత తీసుకున్నాడు. ఏడేళ్లుగా రోజూ వాటి కడుపు నింపుతున్నాడు. దాదాపు 300 ఆవులకు ఆహారం పెట్టిన తర్వాతే పనికి వెళ్లే ఈ కూలీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మధ్యప్రదేశ్ భైరుండాకు చెందిన గౌతమ్ యాదవ్  వీధి జంతువులకు  అన్నీ తానై బతికిస్తున్నాడు. చుట్టుపక్కల ఇండ్లలో మిగిలిపోయిన రొట్టెలు, చపాతీను సేకరించి ప్రతి రోజూ 300 ఆవులు, వీధికుక్కలకు ఆహారంగా పెడతాడు. నీవు సహాయం చేయాలంటే ధనవంతుడివి కావాల్సిన పనిలేదు.. మానవత్వం ఉంటే చాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు .

ఏంటి గౌతమ్ స్టోరీ..

సెహోరె జిల్లాలోని భైరుండాలో అందరూ డ్యూటీకి వెళ్లి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ కూలీ రెండో డ్యూటీకి ఎక్కుతాడు. ఒక తోపుడు బండి తీసుకుని వీధి వీధి తిరిగి మిగిలిపోయిన రొట్టెలు, చపాతీలు కలెక్ట్ చేస్తాడు. అవి తనకు కాదని.. వీధి పశులకు, జంతువులకు అని చెప్పి ప్రతి రోజూ సేకరిస్తాడు. 

గత ఏడేళ్లుగా గౌతమ్ చేస్తున్న ఈ పనికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. వీధి జంతువులపై అతని మమకారాన్ని, బాధ్యతను మెచ్చిన స్థానికులు.. రోజూ ఒంట  చేసే క్రమంలో కొన్ని రొట్టెలు ఎక్కువగా చేస్తారు. గౌతమ్ రాగానే ఇచ్చేస్తారు. వీధి జంతువులకు ఆహారం పెట్టడం తన జీవితంలో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మారింది గౌతమ్ కు. 

పని తర్వాత మొదలయ్యే సెకండ్ షిఫ్ట్..

తన రోజూ వారి కూలీ పని పూర్తయ్యాక రెస్ట్ తీసుకోడు గౌతమ్. సాయంత్రం రాగానే తోపుడు బండి తీసుకుని ఇల్లు ఇల్లు తిరిగి మిగిలిపోయిన రోటీలు సేకరిస్తాడు. కొందరు రొట్టెలు, కొందరు చపాతీలు, కొందరు బ్రెడ్డు.. ఇలా ఎవరికి తోచింది వాళ్లు ఇస్తారు. వాటితో వీధి వీధిలో ఉండే ఆవులు, దూడలు, గేదెలు, కుక్కలు.. ఇలా వీధి జంతువులకు ఆహారం అందించి కడుపు నింపుతాడు. 

రోజూ కూలీగా చాలీ చాలని జీవితాన్ని గడుపుతున్న అతడు.. ఎలాంటి వాహన సదుపాయం లేకున్నా.. తోపుడు బండితో టౌన్ అంతా తిరిగి జంతువులను పోషించడం ఎందరినో ఆకట్టుకుంది. ఆహారం పెట్టమని ఆ మూగజీవాలు అడగవు. కానీ వాటి కడుపు బాధ తెలుసుకున్న గౌతమ్.. తనకెన్ని కష్టాలు ఉన్నా తన బాధ్యతను మాత్రం మరిచిపోడు. తన కూలీ పని పూర్తయిన వెంటనే వెళ్లి వాటి ఆహారం సేకరించి వాటి కడుపు నిండాకే పడుకుంటాడట. 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది మెచ్చుకుంటూ షేర్ చేస్తున్నారు. మానవత్వానికి డబ్బుతో పనిలేదు. ఆస్తితో అంతకన్నా పనిలేదు. చేయాలనే మంచి మనసు ఉంటే చాలు. అతడు కూడా అలాగే తన చుట్టూ ఉండే మూగజీవాలకు అన్నదాతగా మారాడని పోస్టులు పెడుతున్నారు. @sathyashrii అనే అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది.