మంచిర్యాల: తన గడ్డంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి రైతుల గురించి ఆలోచన లేదని.. కేవలం నా గడ్డం గురించే ఆలోచిస్తున్నాడని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం కంటే నా గడ్డమే ఆయనకు పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిని తిట్టే తిట్లు చూసాక కూడా ఎవరైనా ఆయనలా మారాలి అనుకుంటారా అని ప్రశ్నించారు.
తానే కాదు ఏ ఒక్కరూ కూడా రేవంత్ రెడ్డి లాగా మారాలని అనుకోరని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టే తిట్లు చూస్తుంటే తెలుగు బాషలో ఇన్ని తిట్లు ఉంటాయని కూడా నాకు తెలియదన్నారు. రైతులు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి దేనికి పనికిరాని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం (నవంబర్ 11) నిర్మల్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన సభ నిర్వహించింది. కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చావు నోట్లో తలపెట్టైనా తెలంగాణ తెస్తా అన్న మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూముల్లో నీరు పారించిన నేత కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో రివర్స్ పంపింగ్ ద్వారా కేసీఆర్ నీళ్లు నింపిడని.. కాళేశ్వరంలో శివుడి పాదాల దగ్గరున్న నీళ్లను, శ్రీరాముడి శిరస్సు దాకా తీసుకొచ్చిన భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు.
సర్కారు తుమ్మలు మొలిచిన శ్రీరాంసాగర్ కాలువల్లో కాళేశ్వరం జలాలను పరవళ్లు తొక్కించి, ఆయకట్టు చివరి మడి దాకా పారించి చూపించాడని అన్నారు. సమైక్య రాష్ట్రంలో కరువు, ఆత్మహత్యలే ఉండేవని.. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరలేదని.. రూ.4000 కోట్లు బడ్జెట్ ఇస్తామని అన్నారు అవి లేవని విమర్శించారు. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తామని అన్నారు.. కానీ రూ.5 వేలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ తోఫా కూడా గయాబ్ అయిందన్నారు. కేసీఆర్ అన్ని చూస్తున్నాడని.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను ఢిల్లీ వరకు పరిగెత్తించి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మోడీ హృదయంలో తెలంగాణ రాష్ట్రం లేదా..?
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో నోరెత్తే ధైర్యం లేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదన్నారు. పక్కనే ఉన్న ఏపీకి, మహారాష్ట్రకు కరువు బృందాలను పంపిన మోడీ సర్కార్.. తెలంగాణ రైతులు కరువుతో అల్లాడుతుంటే కనీసం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర, ఏపీకి వెళ్లిన కేంద్ర బృందాలు తెలంగాణ ఎందుకు రాలేదు.. మోడీ హృదయంలో తెలంగాణ లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారని నిలదీశారు. చూసుకుని మురవాలి, పట్టుకుని ఏడవాలి అన్నట్టు ఉంది తెలంగాణలో బీజేపీ ప్రజాప్రతినిధుల పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు నిర్మల్ ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. కానీ కేసీఆర్ నిర్మల్‌ను జిల్లా చేసి, మెడికల్ కాలేజీ ఇచ్చి, సదర్మాట్ బ్యారేజ్ కట్టించారన్నారు.
