- అప్పులపై 12 నెలల మారటోరియం
- తీవ్ర కరువు మండలాల్లో ఐదేండ్ల దాకా గడువు
- మిగిలిన చోట్ల మూడేండ్ల వరకు అవకాశం
- దరఖాస్తు లేకుండా బ్యాంకులే రీషెడ్యూల్ చేయాలి
- డిసెంబర్ 8లోగా ప్లాన్.. మార్చి 7 నాటికి అమలు
- అనుబంధ రంగాలకు అదనపు రుణాలు ఇవ్వాలి
- రీషెడ్యూల్ రుణాలకూ వడ్డీ రాయితీ కోరిన బ్యాంకర్లు
- వసూళ్ల పేరుతో రైతులను వేధించొద్దు
- ఎస్ఎల్బీసీ భేటీలో కీలక నిర్ణయాలు
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో అల్లాడుతున్న రైతులకు భారీ ఊరట లభించింది. 365 కరువు మండలాల పరిధిలో 2026 ఖరీఫ్‌కోసం తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకర్లు ప్రజాభవన్‌లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. కన్వీనర్ బ్యాంకు ఎస్బీఐ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలను ఆదుకునేందుకు కార్యాచరణ ప్రకటించారు. రైతు రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేశారు. కరువు కారణంగా వ్యవసాయ దిగుబడులు తగ్గి, రైతుల ఆదాయాలు దెబ్బతినడంతో పాటు పాడి, పౌల్ట్రీ, ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. దీంతో సభ్య బ్యాంకుల పరిధిలోని రుణ ఖాతాలకు ఊరట కల్పిస్తూ పలు నిర్ణయాలు వెలువడ్డాయి.
కరువు నేపథ్యంలో రైతుల పట్ల బ్యాంకులు సానుభూతితో, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వసూళ్ల పేరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించొద్దు.
తీవ్ర కరువున్న 111 మండలాల్లో 12 నెలల మారటోరియంతో కలిపి గరిష్టంగా ఐదేండ్లు, మోస్తరు కరువున్న 254 మండలాల్లో మారటోరియంతో కలిపి గరిష్టంగా మూడేండ్లు రుణ చెల్లింపు గడువు. స్వల్పకాలిక పంట రుణాలు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ రంగాల రుణాలన్నింటికీ ఇది వర్తిస్తుంది.
రీషెడ్యూల్ అయిన ఖాతాలకు పంట బీమా పరిహారం వస్తే అది నేరుగా ఆ రుణ ఖాతాకే జమ అవుతుంది. సాధారణ వడ్డీ రాయితీ, సకాలంలో చెల్లించేవారికి ప్రోత్సాహకం కొనసాగుతుంది.
- రీషెడ్యూల్ రుణాలకు చెల్లింపు గడువు ముగిసేదాకా వడ్డీ రాయితీ వర్తించేలా కేంద్రంతో మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాంకర్లు కోరారు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సాయాన్ని పరిగణనలోకి తీసుకుని, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఈ ఉపశమన ప్రణాళికను అమలు చేయాలి.
- రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అర్హులను బ్యాంకులే గుర్తించి, దరఖాస్తు చేయకపోయినా ‘సుమోటో’గా రీస్ట్రక్చరింగ్ మొదలుపెట్టాలి.
- రీషెడ్యూల్ వద్దనుకునే రైతులు కరువు ప్రకటించిన 135 రోజుల్లోగా, అంటే 2027 మార్చి 7 దాకా ఎప్పుడైనా ‘ఆప్ట్–అవుట్’ కావొచ్చు.
- నష్టపోయిన రైతులు మళ్లీ సాగు, ఉత్పాదక పనులు మొదలుపెట్టేందుకు నగదు ప్రవాహ అంచనాల ఆధారంగా, బ్యాంకుల బోర్డు ఆమోదిత నిబంధనల ప్రకారం అదనపు రుణాలు మంజూరు చేయాలి. ఈ సహాయక చర్యల అమలుకు ఎస్ఎల్బీసీ పక్కా క్యాలెండర్ నిర్దేశించింది.
- అక్టోబర్ 24న కరువు ప్రకటన రాగా, అక్టోబర్ 30న బ్యాంకులకు అధికారిక సమాచారం అందింది. అక్టోబర్ 31, ఈ నెల 10న ప్రత్యేక ఎస్ఎల్బీసీ భేటీలు జరిగాయి. 15వ తేదీ నాటికి విపత్తు నోటిఫికేషన్‌ను ఆర్బీఐ ‘సిమ్స్’ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
- కరువు ప్రకటించిన 45 రోజుల్లోగా, డిసెంబర్ 8 నాటికి అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రీస్ట్రక్చరింగ్ ప్రారంభించాలి. 135 రోజుల్లోగా, 2027 మార్చి 7 నాటికి క్షేత్రస్థాయిలో వంద శాతం పూర్తి చేయాలి. ఆ తర్వాత మార్చి 31, సెప్టెంబర్ 30న సిమ్స్ పోర్టల్‌లో బ్యాంకులు అర్ధవార్షిక నివేదికలు పెట్టాలి.
పలు సిఫార్సులకు ఎస్ఎల్బీసీ ఆమోదం
వ్యవసాయ అనుబంధ రంగాల సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన సబ్-కమిటీ పలు కీలక సిఫార్సులు చేయగా ఎస్ఎల్బీసీ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 24 నుంచి రాబోయే ఏడాది కాలంలో రైతులు చెల్లించాల్సిన దీర్ఘకాలిక రుణాల వాయిదాలు, వడ్డీలపై 12 నెలల పాటు మారటోరియం విధిస్తూ, చెల్లింపు గడువును మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించింది. రైతులకు అవసరమైన తాజా వర్కింగ్ క్యాపిటల్ లేదా కొత్త రుణాలను 12 నెలల మారటోరియంతో కలిపి మొత్తం 36 నెలల కాలపరిమితితో టర్మ్ లోన్‌గా మంజూరు చేయాలని సూచించింది.
ఈ రుణాలు నాబార్డ్ నిర్దేశించే యూనిట్ వ్యయం ఆధారంగా ఇవ్వాల్సి ఉన్నందున.. రాష్ట్ర స్థాయి యూనిట్ కాస్ట్ కమిటీని (ఎస్ఎల్యూసీసీ) తక్షణమే ఏర్పాటు చేసి, నవంబర్ 17, 2026 నాటికి వివిధ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల సవరించిన యూనిట్ వ్యయాలను ఖరారు చేసి సమర్పించాలని నాబార్డ్‌ను ఎస్ఎల్బీసీ ప్రత్యేకంగా కోరింది. నాబార్డ్ కొత్త యూనిట్ వ్యయాలు ఖరారు కాగానే రైతులకు అవసరమైన అదనపు పెట్టుబడి సాయాన్ని బ్యాంకులు నిరాటంకంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
