షాకిచ్చిన మదర్ డెయిరీ.. సడెన్గా ధరల పెంపు.. కొత్త రేట్లు ఇవే!

షాకిచ్చిన మదర్ డెయిరీ.. సడెన్గా ధరల పెంపు.. కొత్త రేట్లు ఇవే!

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న సామాన్యుల నెత్తిపై మరో పిడుగు పడింది. మదర్ డెయిరీ సడెన్ గా ధరలు పెంచడంతో మధ్యతరగతి పై మరింత ఆర్థిక భారం పడనుంది. పెంచిన ధరలు 2026 నవంబర్ 12 నుంచి అమలులోకి రానున్నట్లు ప్రకటించింది. అయితే మదర్ డెయిరీ రూట్లోనే మిగతా పాల కంపెనీలు ధరలు పెంచితే ఏంటి పరిస్థితి అనే ఆందోళన అందరిలో నెలకొంది. 
 
 ఏ పాలకు ఎంత పెరిగిందంటే.. 

బల్క్‌లో విక్రయించే టోన్డ్ మిల్క్ ధర 2 రూపాయలు పెరిగి లీటరు 60 రూపాయలకు చేరింది. పౌచ్‌లో వచ్చే టోన్డ్ మిల్క్ రూ.60 నుంచి రూ.62కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ రూ.54 నుంచి రూ.56కి చేరింది. ఇక ఫుల్ క్రీమ్ మిల్క్ పౌచ్ ధర రూ.72 నుంచి  76 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు ధర 62 నుంచి 65 రూపాయలకు చేరుకుంది.  అయితే ఈ ధరలు ప్రస్తుతం ఢిల్లీ లో అని చెబుతున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా వర్తిస్తుందో లేదో కంపెనీ చెప్పాల్సి ఉంది. 

రైతుల నుంచి పాలు కొనుగోలు చేసే ధర పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. పెరిగిన ప్రొక్యూర్‌మెంట్ కాస్ట్‌లో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాలని కంపెనీ నిర్ణయించిందని సమాచారం. ధరల పెరుగుదలపై మదర్ డెయిరీ ఇంకా స్పందించలేదు.  మదర్ డెయిరీ తన పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 75-80 శాతం రైతులకు అందిస్తుందని పీటీఐ పేర్కొంది.

ఇంతకు ముందు 2026 మే 14, న ధరలు పెరిగాయి. అంతకుముందు ఏప్రిల్ 2025లో రేట్లు సవరించారు.