రణ్‌వీర్ సింగ్ ఇంట తీవ్ర విషాదం.. తాతయ్య మరణంపై మనవరాలి ఎమోషనల్ పోస్ట్!

రణ్‌వీర్ సింగ్ ఇంట తీవ్ర విషాదం.. తాతయ్య మరణంపై మనవరాలి ఎమోషనల్ పోస్ట్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ' దురంధర్ ' హీరోకు వ్యక్తిగత జీవితంలో తీరని విషాదం నింపింది. ఆయన తల్లి తరఫు తాతయ్య, డాక్టర్ రామ్ హింగోరానీ (96) కన్నుమూశారు. దీపావళి పర్వదినం రోజునే ఆయన తుదిశ్వాస విడవడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. ఈ విషయాన్ని రణ్‌వీర్ సింగ్ కజిన్ సౌమ్య హింగోరానీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

తాతయ్య మరణవార్తను తెలియజేస్తూ సౌమ్య పెట్టిన భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 96 ఏళ్ల అద్భుతమైన జీవితాన్ని గడిపిన ఆయన మరణాన్ని విషాదంగా కాకుండా, ఆయన జీవించిన గొప్ప జీవితాన్ని గుర్తుచేసుకునే సందర్భంగా చూడాలని ఆమె పేర్కొన్నారు. లక్ష్మీపూజ జరుగుతున్న పవిత్రమైన సమయంలో.. దీపావళి రోజున తన తాతయ్య ఈ లోకాన్ని విడిచి నానమ్మ దగ్గరకు వెళ్లిపోయారని రాసుకొచ్చారు. మళ్లీ కలుసుకునే వరకు జ్ఞాపకాల్లో జీవించే ఉంటారంటూ భావోద్వేగానికి గురయ్యారు.

రణ్‌వీర్‌కు తన తాతయ్యతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గతంలో 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ' ప్రమోషన్ల సమయంలో తాతయ్యతో కలిసి ఉన్న వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. 93 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా 'టిక్కీ వద్దు.. టెక్విలా తీసుకురండి' అంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్య అప్పట్లో వైరల్ అయింది.

ప్రస్తుతం వృత్తిపరంగా విజయాలతో సాగుతున్న రణ్‌వీర్ జీవితంలో ఈ విషాదం అభిమానులను కలచివేస్తోంది. మరోవైపు రణ్‌వీర్ తదుపరి 'ప్రళయ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన నిర్మాతగానూ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు...