ముంబైకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు రావడంతో కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా కలకలం రేగింది. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అందులోని బాత్రూంలో ఓ బెదిరింపు లేఖ కనిపించింది.
ఎయిర్ ఇండియా విమానం AI 772 బుధవారం ఉదయం 10.20 గంటలకు కోల్‌కతా నుంచి ముంబైకి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానంలోని టాయిలెట్లో చేతిరాతతో ఉన్న ఓ పేపర్ కనిపించింది. విమానాన్ని ఉదయం 11.10 గంటలకు హైజాక్ చేస్తామని అందులో హెచ్చరించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులను అప్రమత్తం చేశారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన విమానాశ్రయ అధికారులు వెంటనే భద్రతా చర్యలు ప్రారంభించారు.
ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు
విమానం అప్పటికే బయలుదేరేందుకు సిద్ధంగా ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా టేకాఫ్‌ను నిలిపివేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాన్ని సాధారణ పార్కింగ్ ప్రాంతం నుంచి ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించారు.
అక్కడ భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు చర్యలు చేపట్టారు. విమానాశ్రయ డైరెక్టర్ విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెదిరింపు సమాచారం అందిన వెంటనే నిర్దేశిత భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేశారు.
బెదిరింపు నిజమేనా? ఆకతాయిల పనా?
ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారు? విమానంలోని ప్రయాణికుల్లో ఎవరైనా ఈ చీటీని ఉంచారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ బెదిరింపు కేవలం ఆకతాయిల చర్యనా లేక నిజమైన ముప్పు ఉందా అనే విషయంపై ఇంకా అధికారిక నిర్ధారణ వెలువడలేదు.
విమానంలో మొత్తం 93 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. తనిఖీలు పూర్తయి అధికారుల నుంచి అనుమతి వచ్చే వరకు విమానం ప్రయాణం నిలిచిపోయింది. ఈ ఘటనతో కోల్‌కతా విమానాశ్రయంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
