బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు.. 'అక్వాన్' పేరు ఏ దేశం పెట్టింది..!

బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు.. 'అక్వాన్' పేరు ఏ దేశం పెట్టింది..!

బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అర్ణబ్, మురసు తుఫానుల తర్వాత ఇప్పుడు 'అక్వాన్' పేరుతో మరో తుఫాన్ రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. అక్వాన్ తుఫాన్ పూర్తి స్థాయిలో ఏర్పడే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని.. మరో మూడు, నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడితే దానికి అక్వాన్ అనే పేరు పెడతారని.. ఈ పేరును ఇరాన్ ప్రతిపాదించినట్లు వివరించింది భాతర వాతావరణ శాఖ.

2026, నవంబర్ 13వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన.. ఆ తర్వాత తుఫాన్ గా మారుతుందా అనేది 15వ తేదీ నాటికి స్పష్టత వస్తుందని.. తుఫాన్ ఏర్పడితే మాత్రం దానికి అక్వాన్ అనే పేరు ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ.

నవంబర్ 13వ తేదీన అల్పపీడనం ఏర్పడినంత మాత్రానా.. అది తుఫానుగా మారుతుందని ఇప్పుడే చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకు సముద్రంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని వెల్లడించారు అధికారులు. ఈ వ్యవస్థ ముందుకు వెళ్లే తీరుపై ప్రస్తుతం మూడు అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు వివరించారు.

మొదటి అవకాశంగా అల్పపీడనం బలపడి తమిళనాడు, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ దిశగా కదలడం. రెండో అవకాశంగా దక్షిణ పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత సముద్రంలోనే దిశ మార్చుకోవడం. మూడో అవకాశంగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడే సమయంలో దిశ మార్చుకుని మయన్మార్ తీరం వైపు వెళ్లడం. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

2026 అక్టోబర్ నెల చివరి వారంలో అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభంలో మురసు తుఫాను కూడా ఏపీలోని తూర్పు తీరాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు వరుసగా మూడో తుఫాన్ ఏర్పడే సూచనలు కనిపించడంతో అధికారులు నిఘా పెంచారు.