డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, లిస్టెడ్ బాండ్లలో ఒకే రకమైన రాబడులు వచ్చినప్పటికీ.. వాటిపై పడే పన్ను భారం కారణంగా చేతికివచ్చే నికర లాభాల్లో భారీ తేడా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని టాక్స్ రూల్స్ ప్రకారం.. ఇన్వెస్టర్లు ఏ ఆప్షన్‌ను ఎంచుకోవాలనేది వారి పన్ను స్లాబ్, పెట్టుబడి కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అసలు ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఇన్వెస్టర్లకు ఎక్కువ రాబడులు దక్కుతాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి...
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 50ఏఏ ప్రకారం.. ఏప్రిల్ 1, 2023 తర్వాత కొనుగోలు చేసిన డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాభాలను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(STCG)గా పరిగణిస్తారు. హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా వీటిపై ఇన్వెస్టర్ల ఆదాయపు పన్ను స్లాబ్ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా 30 శాతం ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నవారికి పన్ను భారం చాలా ఎక్కువగా ఉంటుంది డెట్ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో పెట్టుబడులు పెడితే. దీనివల్ల రిటర్న్స్ భారీగా తగ్గుతాయి.
అలాగే 12 నెలలకు మించి హోల్డ్ చేసిన లిస్టెడ్ బాండ్లకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG) పన్ను రూల్స్ వర్తిస్తాయి. ఇండెక్సేషన్ లేకుండా ఇవి కేవలం 12.5 శాతం పన్ను కిందకు వస్తాయి. అయితే బాండ్లపై క్రమం తప్పకుండా వచ్చే కూపన్ వడ్డీ మాత్రం యథావిధిగా స్లాబ్ రేట్ల ప్రకారమే ట్యాక్సబుల్. ఉదాహరణకు.. రూ. 5 లక్షల పెట్టుబడిపై 3 ఏళ్ల కాలానికి 8 శాతం చొప్పున రూ.లక్షా 29వేల856 లాభం వస్తే.. డెబ్ట్ ఫండ్స్‌పై 30% ట్యాక్స్ కింద రూ. 40వేల515 చెల్లించాల్సి వస్తుంది. అదే లిస్టెడ్ బాండ్లపై 12.5% ట్యాక్స్ కింద జస్ట్ రూ. 16వేల 881 మాత్రమే పన్ను భారం పడుతుంది. దీనివల్ల డైరెక్ట్ బాండ్ల పెట్టుబడులపై సుమారు రూ. 23వేల 634 వరకు అదనపు లాభం మిగులుతుందని అకౌంటింగ్ నిపుణులు చెబుతున్నారు.
అయితే లిస్టెడ్ బాండ్లలో లిక్విడిటీ సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ వాల్యూమ్ తక్కువగా ఉంటే అమ్మకం కష్టమవుతుంది. డెబ్ట్ ఫండ్స్ మాత్రం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, డైవర్సిఫికేషన్‌తో సులభంగా రెడీమ్ చేసుకునే సౌలభ్యాన్నిస్తాయి. అధిక ట్యాక్స్ స్లాబ్‌లో ఉన్నవారు.. 12 నెలల కంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ ఉంటే లిస్టెడ్ బాండ్లు పన్ను పరంగా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే క్రెడిట్ క్వాలిటీ, వడ్డీ రేట్ల రిస్క్‌లను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.
