నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు : రూ.3 లక్షల్లోనే వస్తుంది.. 100 కిలోమీటర్లు గ్యారంటీ..!

  నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు : రూ.3 లక్షల్లోనే వస్తుంది.. 100 కిలోమీటర్లు గ్యారంటీ..!

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చింది. ఇటలీలోని మిలన్ నగరంలో జరిగిన EICMA 2026 ఆటోమొబైల్ ప్రదర్శనలో  కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసింది.

ఈ ప్రదర్శనలో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించింది NEX పేరుతో తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌లు. ఇందులో చిన్న దూర ప్రయాణాలకు ఉపయోగపడే ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ వాహనం, మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్, అలాగే రెండు సీట్లతో కూడిన చిన్న ఎలక్ట్రిక్ కారు ఉన్నాయి. అంతేకాదు, కంపెనీ ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ VIDAను యూరప్‌లోని 10 దేశాలకు విస్తరిస్తున్నట్లు కూడా హీరో ప్రకటించింది.

ఈ సందర్భంగా కంపెనీ  ఫ్యూచర్ వాహనాల తయారీ, కొత్త టెక్నాలజీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'నోవస్ ల్యాబ్స్' (Novus Labs) అనే ఇన్నోవేషన్ సెంటర్  కూడా పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలలో వరుసగా 25 ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోనూ  వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.

NEX 3: అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న ఎలక్ట్రిక్ కారు!

NEX సిరీస్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వాహనం NEX 3. ఎందుకంటే ఇది ద్విచక్ర వాహనం కాదు, మూడు చక్రాల వాహనం కూడా కాదు. ఏకంగా రెండు సీట్లతో కూడిన చిన్న ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, తక్కువ స్థలంలో ప్రయాణించడానికి వీలుగా NEX 3ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి మొత్తం నాలుగు చక్రాలు ఉంటాయి. ఇందులో ఇద్దరు ప్రయాణించేందుకు వీలుగా రెండు సీట్లు ఉంటాయి. డ్రైవర్ ముందు కూర్చుంటే, మరో ప్రయాణికుడు వెనుక కూర్చుంటారు. ఇందులో సాధారణ కార్లలాగా రెండు వైపులా డోర్లు ఉండవు. పైకి తెరుచుకునే గల్‌వింగ్ తరహా డోర్ ఉంటుంది.

ఎయిర్ కండిషనింగ్(AC) సదుపాయం కల్పించేలా డిజైన్ చేశారు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లకు కూడా అవకాశం ఉంటుంది. ఈ కారును సాధారణ కార్లతో పోలిస్తే తక్కువ రోడ్డు స్థలాన్ని ఆక్రమించేలా రూపొందిస్తున్నారు. పార్కింగ్ చేయడానికి కూడా తక్కువ స్థలం సరిపోతుంది.

ముఖ్యంగా సిటీలో రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, చిన్న దూరాలు ప్రయాణించేవారు, షేర్డ్ మొబిలిటీ సేవలు అందించే సంస్థలకు ఈ కార్  ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే NEX 3 ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉంది. దీన్ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారు?  ధర ఎంత ఉంటుంది? వంటి వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

అయితే ఈ చిట్టి కారు ముందు భాగంలో డిజిటల్ లేదా ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కాంపాక్ట్ బాడీ ప్యానెల్స్, ఫుల్ క్లోజ్డ్ క్యాబిన్ ఉంటాయి.ఇందులో ఇద్దరు వ్యక్తులు అంటే డ్రైవర్, వెనుక ఒక ప్రయాణికుడు సౌకర్యవంతంగా కూర్చునేలా టాన్డెమ్/కాంపాక్ట్ సీటింగ్ అందించారు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగిస్తున్న అధునాతన రిమూవబుల్ (తొలగించగల) బ్యాటరీ టెక్నాలజీ లేదా ప్రత్యేకమైన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే దాదాపు 100 నుండి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చేలా దీని పవర్‌ట్రైన్‌ను రూపొందిస్తున్నట్లు  తెలుస్తుంది. .

ప్రస్తుతం హీరో కంపెనీ ఈ కారు పేటెంట్ డిజైన్లను నమోదు చేయడంతో పాటు రోడ్డు పరీక్షల దశను సిద్ధం చేస్తోంది. భారత మార్కెట్లో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును రూ. 3 లక్షల నుండి రూ. 4.5 లక్షల లోపు ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. మధ్యతరగతి వాహనదారులకు, ఆఫీసులకు వెళ్లి వచ్చే ఉద్యోగులకు ఇంకా రోజు షాపింగ్ అవసరాలకు ఇది ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ కారుగా  మారనుంది.

మరిన్ని వార్తలు