తెలంగాణ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. ఓటు ద్వారా ఇచ్చే తీర్పుతోనే రాజకీయాల్లో మార్పు సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పోరాటాలు చేసినా ఆశించిన మార్పు కనిపించడం లేదని విమర్శించారు.
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది జనాభాలో సుమారు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని, అయితే వారిలో 10 లక్షల మంది కూడా ఓటర్లుగా నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం సరైన పద్ధతి కాదని, యువత ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రూ.200 కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయిందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మంది యువ ఎంపీల్లో రాజకీయ నేపథ్యం లేని వారు ఒక్కరే ఉన్నారని పేర్కొంటూ, యువతకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని 77 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నేటి నుంచే అధికారికంగా ప్రచారం ప్రారంభిస్తున్నామని, తమ అభ్యర్థులకు వీరతిలకం దిద్ది ఎన్నికల యుద్ధరంగంలోకి దింపుతున్నామని చెప్పారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగుతామని వెల్లడించారు.
తమ పార్టీకి ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు ఉందని, కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
