ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ వాడకుండానే అకౌంట్లో డబ్బు మాయం: SBI కస్టమర్‌కి న్యాయం చేసిన కోర్టు

ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ వాడకుండానే అకౌంట్లో డబ్బు మాయం: SBI కస్టమర్‌కి న్యాయం చేసిన కోర్టు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్‌కు రాజ్‌కోట్ జిల్లా కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్రల్ కమిషన్ అండగా నిలిచింది. ఎలాంటి ఏటీఎం కార్డు వాడకపోయినా, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించకపోయినా ఒక సీనియర్ సిటిజన్ ఖాతా నుంచి రూ.లక్షా 60వేలు మాయమైన వ్యవహారంలో బ్యాంకుదే పూర్తి తప్పని కోర్టు తేల్చింది. బాధితుడికి న్యాయం చేస్తూ.. కోల్పోయిన మొత్తంపై వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.

అసలు ఏం జరిగింది?
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 68 ఏళ్ల దిలీప్ ఛాత్వాని అనే వృద్ధుడికి స్టేట్ బ్యాంక్ అమిన్ మార్గ్ బ్రాంచ్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. ఆయన తన జీవితంలో ఎప్పుడూ ఏటీఎం కార్డును యాక్టివేట్ చేసుకోలేదు. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలను సైతం ఎన్నడూ ఉపయోగించలేదు. కేవలం చెక్కుల ద్వారా మాత్రమే తన లావాదేవీలను నిర్వహించేవారు.

అలాంటి వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి 2023 సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 25 మధ్య కాలంలో పలు మార్లు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AePS) ద్వారా మొత్తం రూ.లక్షా 60వేలు డ్రా అయ్యాయి. తనకు ఎలాంటి ఓటీపీ రాలేదని, తాను డబ్బు విత్‌డ్రా చేసేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బాధితుడు వాపోయారు.

సైబర్ క్రైమ్.. బ్యాంకు స్పందన:
తన ఖాతా నుంచి డబ్బులు మాయమైనట్లు గుర్తించిన వెంటనే దిలీప్ ఛాత్వాని 2023 సెప్టెంబర్ 26న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అదే రోజు సైబర్ క్రైమ్ సెల్‌ను కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై లాయర్ చిరాగ్ ఛాగ్ వాదనలు వినిపిస్తూ.. సైబర్ క్రైమ్ విచారణలో ఈ లావాదేవీలు బ్యాంక్ అధికారిక సిబ్బంది ద్వారానే ఆమోదించబడినట్లు తేలిందని వెల్లడించారు. బ్యాంకు నిర్లక్ష్యం వల్లనే తన డబ్బు పోయిందని ఆరోపిస్తూ ఆయన కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు.

కన్స్యూమర్ కమిషన్ తీర్పు:
ఈ కేసును విచారించిన కమిషన్ అధ్యక్షుడు పి.సి. రావల్, సభ్యుడు ఎం.ఎస్. భట్‌లతో కూడిన బెంచ్ బాధితుడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. వృద్ధుడని కూడా చూడకుండా సకాలంలో స్పందించకుండా బ్యాంకు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని.. ఇది సేవల్లో లోపం కిందకు వస్తుందని కమిషన్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా వినియోగదారులకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని పేర్కొంటూ రాజ్‌కోట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్‌బీఐ బ్యాంకు దిలీప్ ఛాత్వాని ఖాతాకు రూ.లక్షా 59వేల 999 ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తానికి ఫిర్యాదు చేసిన నాటి నుంచి 9 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం అదనంగా రూ. 10వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. డిజిటల్ మోసాలు పెరుగుతున్న సమయంలో బ్యాంకు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.