మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.. తమిళనాడులో అసలేం జరుగుతోంది.?

మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.. తమిళనాడులో అసలేం జరుగుతోంది.?

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.   సీఎం,తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు జోసెఫ్ విజయ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం అయ్యారు. చెన్నై సమీపంలోని పనైయూర్‌లో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న మరుసటి రోజే ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తన, నేతలపై వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వ స్థిరత్వం వంటి అంశాలపై విజయ్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇటీవల కల్లకురిచ్చి ఎమ్మెల్యే అరుల్ విఘ్నేశ్‌పై జిల్లా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపారంటూ ఆరోపణలు రావడం వివాదాస్పదమైంది. అయితే ఆయన ఈ ఆరోపణలను ఖండించారు.

అలాగే తురైయూర్ ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌పై ఓ వృద్ధుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం విమర్శలకు దారితీసింది. మరోవైపు మంత్రి శరత్ కుమార్‌కు సంబంధించిన పాత వీడియోపై కూడా వివాదం నెలకొంది. అందులో కనిపిస్తున్న పదార్థం డ్రగ్స్ అంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా, అది తన చిన్నారికి సంబంధించిన మాత్ర అని మంత్రి వివరణ ఇచ్చారు. మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలపైనా పలు  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యం

ప్రస్తుతం 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది మద్దతుకు ఇంకా తొమ్మిది మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్‌తో పాటు వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతోంది.

డీఎంకే, అన్నాడీఎంకే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను రెండు పార్టీలు ఖండించాయి.మరోవైపు ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వాటిలో విజయం సాధించడం ద్వారా బలాన్ని పెంచుకోవాలని టీవీకే భావిస్తోంది. ఈ ఎన్నికల్లో ఐదు స్థానాలూ గెలిచినా పార్టీ బలం 114కు చేరుతుంది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ ఐక్యంగా ఉంచడం, పార్టీ క్రమశిక్షణను కఠినతరం చేయడం, మంత్రివర్గంలో మార్పులు చేయాలా అనే అంశాలపై విజయ్ చర్చించే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులపై ఇంకా అధికారిక స్పష్టత లేదు.