Ram Gopal Varma: నాస్తికుడిగా 'రామాయణ' చూశా.. రావణుడు లేకపోతే రాముడే లేడు: ఆర్జీవీ మార్క్ రివ్యూ!

Ram Gopal Varma: నాస్తికుడిగా 'రామాయణ' చూశా.. రావణుడు లేకపోతే రాముడే లేడు: ఆర్జీవీ మార్క్ రివ్యూ!

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది రణబీర్ కపూర్, యష్ 'రామాయణ'.  నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 820 కోట్లు రాబట్టింది. మరో రెండు మూడు రోజుల్లోనే రూ 1000 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. సినీ ప్రముఖుల ప్రశంసలతోనూ మార్మోగుతోంది. 

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌పై లేటెస్ట్ గా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు.. సినిమాను రెండోసారి థియేటర్‌లో వీక్షించి తనదైన శైలిలో అదిరిపోయే రివ్యూ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాను నాస్తికుడినని, రామభక్తుడిగా కాకుండా ఒక సినీ ప్రేక్షకుడిగా ఈ విశ్లేషణ ఇస్తున్నానని ఆర్జీవీ స్పష్టం చేశారు. సాధారణంగా కొందరు విమర్శకులు సినిమా భారీ స్థాయిని మెచ్చుకుంటూనే కథలో ఆత్మ లేదని, సంగీతం అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారని.. కానీ ఈ సినిమా అసలు ఆత్మే దాని అద్భుతమైన స్థాయి, నిర్మాణం వెనుక ఉన్న అపారమైన సంకల్పమని పేర్కొన్నారు. ముఖ్యంగా రావణుడి పది తలల రూపకల్పన, విశ్వయుద్ధ సన్నివేశాలు, అడవుల చిత్రీకరణ, జటాయువు ఎపిసోడ్ తనను అబ్బురపరిచాయని కొనియాడారు. 

హాలీవుడ్ భారీ చిత్రాలు సైతం ఈ విజువల్ గ్రాండియర్ ముందు స్టేజ్ డ్రామాల్లా కనిపిస్తున్నాయని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. యష్ పోషించిన రావణుడి పాత్రపై ప్రశంసలు కురిపిస్తూ.. ఇది ఒక్క ఏడాదికే పరిమితమైన ఉత్తమ నటన కాదని, దశాబ్దాల పాటు గుర్తుండిపోయే ప్రదర్శన అని అభివర్ణించారు. రావణుడి శక్తి, శివభక్తి, మేధస్సు, అహంకారం వెనుక ఉన్న సంఘర్షణలను యష్ అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. 'రావణుడు లేకుండా రాముడు లేడు' అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఇక రణబీర్ కపూర్ రాముడిగా తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని పాత్రకు న్యాయం చేశారని ప్రశంసించారు. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం విజువల్స్‌తో పోటీపడకుండా కథలోని భావోద్వేగాలను మరింత పెంచిందన్నారు. ఈ 'రామాయణ' భారతీయ సినిమా గర్వంగా తలెత్తుకునేలా చేసిన చిత్రమని, నవంబర్ 5 తర్వాత వచ్చే ప్రతి భారీ సినిమాకు ఇదే కొత్త కొలమానం అవుతుందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.  బాక్సాఫీస్ రికార్డులతో దూసుకుపోతున్న రామాయణానికి ఆర్జీవీ ప్రశంసలు మరింత హైప్ తీసుకొస్తున్నాయి.