టెక్ దిగ్గజం IBM తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా టెక్కీలను, ముఖ్యంగా భారతీయ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ నిపుణుల నియామకాలు, హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్‌లపై విధిస్తున్న కఠిన నిబంధనలతో ఐబీఎం తన అతిపెద్ద విభాగమైన 'ఐబీఎం కన్సల్టింగ్'లో కీలక మార్పులు చేసింది. ఈ విభాగంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్లను ఇక నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అంటే ఐబీఎం కన్సల్టింగ్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కి ఇకపై కొత్తగా వీసాలు, గ్రీన్ కార్డ్ కోసం కంపెనీ తరఫున స్పాన్సర్షిప్ లభించదు. దీనివల్ల ఇప్పటికే ఆయా స్థానాల్లో వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగుల ముందు 2 కఠినమైన దారులు మాత్రమే మిగిలాయి. వారు అమెరికాను వీడి వేరే దేశాల్లోని ఐబీఎం ఆఫీసుల్లో పనిచేయటం లేదా ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగాన్ని వదిలి బయటకు వెళ్లాల్సిందేనని కంపెనీ స్పష్టం చేసింది. లక్షా 50వేలకు పైగా ఉద్యోగులున్న ఈ కన్సల్టింగ్ డివిజన్లో నిబంధనల మార్పు తీవ్ర కలకలం రేపింది.
ఇటీవల ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన కఠిన చర్యల ప్రభావమే దీని వెనుక ఉందన్న వాదన బలపడుతోంది. గడచిన నెలలో మైక్రోసాఫ్ట్, అడోబ్ తో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ అవుట్సోర్సింగ్ సంస్థలను సైతం శాశ్వత లేబర్ సర్టిఫికేషన్(PERM) ప్రక్రియ నుండి సస్పెండ్ చేయడం తెలిసిందే. దీనికి తోడు హెచ్-1బీ దరఖాస్తులపై భారీగా ఫీజులను పెంచే ఆలోచనలో ఉండటంతో టెక్ కంపెనీలు స్పాన్సర్ చేసి విదేశీ ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయి.
భారతీయ టెక్కీలపై ప్రభావం:
అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, అక్కడే స్థిరపడాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్లకు ఐబీఎం నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఐటీ రంగంలో జాబ్ సేఫ్టీ ప్రశ్నార్థకం మారుతున్న సమయంలో.. అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెక్కీలు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ నిర్ణయం తర్వాత విదేశీ ఉద్యోగులపై ఆధారపడటాన్ని అక్కడి కంపెనీలు తగ్గించుకోవటంతో.. భవిష్యత్తులో ఫారెన్ వెళ్లి స్థిరపడాలనుకుంటున్న వారి కోరికలకు బ్రేక్ పడుతోంది.
