ఐదు కోట్ల ఏపీ ప్రజలను రెండు రాజకీయ పార్టీలో పాలించాలా..? అని ప్రశ్నించారు పరివర్తన రాజనీతి పార్టీ (PRP) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ సాయి రెడ్డి. ఏ ఒక్కరో రాష్ట్రాన్నీ, దేశాన్ని మార్చలేరు..ప్రజలే మార్పును తీసుకురావాలి.. ఏపీ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లోనే లేదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని విజయ్ సాయి రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ప్రారంభ సభలో మాట్లాడిన విజయ సాయి రెడ్డి.. యువతలో నాయకత్వ లక్షణాలను వెలికితీసి , నాయకత్వాన్నిప్రోత్సహించేందుకు పరివర్తన రాజనీతి పార్టీ ఆవిర్భవించిందన్నారు.
ఐదు కోట్ల ఆంధ్రులను కేవలం రెండు కుటుంబాలే పాలించాలా.. ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి కావాలా, ప్రతిపక్ష నాయకుడి పిల్లలే ముఖ్యమంత్రి కావాలా అని నిలదీస్తూ, ఆ రెండు కుటుంబాల ఆధిపత్యానికి ,వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.
తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి సామాజిక వర్గం నుంచి నాయకత్వ లక్షణాలున్న యువతను ఎంపిక చేసి, వారినే సీఎం చేయాలన్నదే పార్టీ ఉద్దేశమని చెప్పారు. పార్టీలో యువతకు 66 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కొత్త తరం.. కొత్త పార్టీ అనే నినాదంతో రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తాను ఈ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దేశభక్తి, ప్రజా సంక్షేమం ,ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే తమ పార్టీ ప్రధాన సిద్ధాంతాలని చెప్పారు.
