Health alert: షుగర్ ఉన్న వాళ్లకు.. 21 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ..!

Health alert: షుగర్ ఉన్న వాళ్లకు.. 21 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ..!

షుగర్ కు క్యాన్సర్ కు ఏదైనా సంబంధం ఉందా..? షుగర్ ఉన్నవారిలో  క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయా..? అనే చాలామంది డౌట్స్ ఉంటాయి. అయితే ఇటీవల  జరిపిన పరిశోధనల్లో వీటి మద్య సంబంధాన్ని పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించి ఓ రిపోర్టును  ప్రచురించారు. షుగర్ తో క్యాన్సర్ ముప్పు, క్యాన్సర్ తో షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువే..  షుగర్ ఉన్న వ్యక్తులలో అత్యంత సాధారణమైన 24 రకాల క్యాన్సర్లలో 21 రకాలు అధికంగా సంభవిస్తున్నాయని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. 

 షుగర్ ఉన్నవారిలో కాలేయం, క్లోమం, పెద్దప్రేగు, రొమ్ము,గర్భాశయ క్యాన్సర్లు బయటపడుతున్నాయని, అంతేకాకుండా  క్యాన్సర్ ,దాని చికిత్సలు రక్తంలో చక్కెర నియంత్రణకు అంతరాయం కలిగించి రోగులలో షుగర్  వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు. 2026లో డయాబెటిస్ థెరపీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ సమీక్ష, దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మందిపై నిర్వహించిన పరిశోధన ఆధారంగా రూపొందించినట్లు చెప్పారు పరిశోధకులు.

షుగర్ ఉన్న వారిలో  నాన్-హాడ్కిన్ లింఫోమాకు 11శాతం, కాలేయ క్యాన్సర్‌కు 200శాతం కంటే ఎక్కువగా ముప్పు పెరిగినట్లు గుర్తించారు. ప్యాంక్రియాటిక్, పెద్దప్రేగు, రొమ్ము, ఎండోమెట్రియల్, మూత్రాశయ, మూత్రపిండ, థైరాయిడ్, కడుపు, అండాశయ క్యాన్సర్లు సైతం ఈ లిస్టులో ఉన్నాయి.

అయితే, టైప్ 2 మధుమేహం ఉన్న పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ సంభవం తక్కువగా నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇది అన్ని క్యాన్సర్లలో ఒకేవిధంగా ఉండదని, ఉమ్మడి ప్రమాద కారకాలు కూడా కారణం అవుతాయని  హెచ్చరించారు.

మరోవైపు క్యాన్సర్  చికిత్సతో కూడా షుగర్ అటాక్ అయ్యే అవకాశం ఉందని ఈ పరిశోధనలో గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో వాడే స్టెరాయిడ్లు, లక్షిత చికిత్సలు, ఇమ్యునోథెరపీ, హార్మోన్ థెరపీ వంటివి రక్తంలో చక్కెర నియంత్రణకు అంతరాయం కలిగించి మధుమేహం వచ్చే ముప్పు పెంచవచ్చని తెలిపారు. క్యాన్సర్ చరిత్ర లేని వారితో పోలిస్తే, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారికి షుగర్ వచ్చే ముప్పు 39శాతం ఎక్కువగా ఉందని 13 కోహార్ట్ అధ్యయనాల విశ్లేషణ తేల్చింది.

మనదేశంలో  సుమారు 10.1 కోట్ల మంది వయోజనులు షుగర్ తో బాధపడుతున్నారు.  మరో 13.6 కోట్ల మంది ప్రీడయాబెటిస్‌తో జీవిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో నోటి క్యాన్సర్ ఉన్నవారిలో షుగర్ అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. 

క్యాన్సర్ నివారణ, చికిత్స, పోస్ట్-కేర్‌లో జీవక్రియ ఆరోగ్యాన్ని అంతర్భాగంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ ఉన్నవారు వయస్సు, ప్రమాద స్థాయికి తగిన క్యాన్సర్ స్క్రీనింగ్ సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. 

గమనిక: నిపుణుల సలహాలతో కూడిన ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది ఏ విధంగానూ అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ  వ్యక్తిగత డాక్టర్ ను సంప్రదించండి. ఈ సమాచారానికి వీ6 యాజమాన్యం గానీ, కంటెంట్ రైటర్ గానీ బాధ్యత వహించదు.