ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం! లక్షణాలు ఎలా ఉంటాయి ? వ్యాక్సిన్లు పనిచేస్తాయా ?

  ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం!  లక్షణాలు ఎలా ఉంటాయి ? వ్యాక్సిన్లు పనిచేస్తాయా ?

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగైపోలేదు. వైరస్ ఎప్పటికప్పుడు  రూపాన్ని మార్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్లుగా మారుతోంది. తాజాగా కోవిడ్-19 వైరస్‌లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీనికి శాస్త్రవేత్తలు PJ.2.1 అని పేరు పెట్టారు.

ఈ కొత్త వేరియంట్‌లో వైరస్‌కు సంబంధించిన స్పైక్ ప్రోటీన్‌లో అనేక మార్పులు జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పుల వల్ల వైరస్ మనుషుల శరీరంలోని కణాలతో ఎలా కలుస్తుంది? వ్యాపించే సామర్థ్యం పెరుగుతుందా ? ఇప్పటికే  ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు దీనిపై పనిచేస్తాయా ? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

కెనడాలోని అంటారియో ప్రాంతంలో 2026 మే నెలలో ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించిన తొలి నమూనా(samples) గుర్తించారు. ఆ తర్వాత అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో కూడా దీని ఉనికిని గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి.

అయితే ఈ కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?  గత వేరియంట్ల కంటే ప్రమాదకరమా? ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు దీనిపై పనిచేస్తాయా?  వివరంగా తెలుసుకుందాం....

PJ.2.1 కొత్త వేరియంట్ ప్రత్యేకత ఏంటి?
 తాజాగా గుర్తించిన PJ.2.1 వేరియంట్‌లో  మార్పులు చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా వైరస్‌కు మన శరీర కణాలతో కలవడానికి ఉపయోగపడే స్పైక్ ప్రోటీన్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు 'సాల్టేషన్ వేరియంట్' (Saltation Variant)గా అభివర్ణిస్తున్నారు. అంటే వైరస్‌లో సాధారణంగా ఒక్కొక్కటిగా చిన్న మార్పులు జరగడం కాకుండా, ఒకేసారి ఎక్కువ సంఖ్యలో జన్యుపరమైన మార్పులు కనిపించడం. ఈ వేరియంట్ JN.1 కుటుంబానికి చెందిన MC.10.1.7 అనే పూర్వ వంశం నుంచి అభివృద్ధి చెందినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.

PJ.2.1 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి?
ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్‌ లక్షణాలను పరిశోధకులు గుర్తించలేదు. అంటే సాధారణ కోవిడ్ సోకినప్పుడు కనిపించే లక్షణాలే ఈ వేరియంట్ సోకిన వారిలో కూడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట లక్షణాలు ఉండవచ్చు.  కొంతమందిలో వీటితో పాటు రుచి లేదా వాసన గుర్తించే శక్తిలో మార్పులు కూడా కనిపించవచ్చు. మరికొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.

అయితే ఈ లక్షణాలు PJ.2.1కు మాత్రమే పరిమితం కావు. ఫ్లూ, సాధారణ జలుబు వంటి ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అందువల్ల లక్షణాలను చూసి మాత్రమే కరోనా సోకిందని లేదా ఈ కొత్త వేరియంట్ వల్లే అనారోగ్యం వచ్చిందని చెప్పలేం. కోవిడ్-19 ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యులు సూచించే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అయితే అది PJ.2.1 వేరియంటా కాదా అని తెలుసుకోవాలంటే జన్యు పరీక్ష (Genetic Sequencing) అవసరం.

ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమా?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల ప్రకారం, గతంలో వ్యాప్తి చెందిన ఇతర కోవిడ్ వేరియంట్లతో పోలిస్తే PJ.2.1 వల్ల మరింత తీవ్రమైన అనారోగ్యం వస్తుందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయితే దీనిని తక్కువ ప్రమాదకరమైన వేరియంట్‌గా కూడా భావించకూడదు. ఎందుకంటే ఈ వేరియంట్‌పై జరిగిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, తీవ్రమైన అనారోగ్యం, మరణాల రేటు వంటి అంశాలపై పూర్తి స్థాయి సమాచారం  లేదు. అందువల్ల ఈ వేరియంట్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం. ముఖ్యంగా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

కోవిడ్ వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్‌పై పనిచేస్తాయా?
PJ.2.1లో స్పైక్ ప్రోటీన్‌కు సంబంధించి అనేక మార్పులు ఉండటంతో, ఇప్పటికే ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు దీనిపై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే అంశంపై పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన శరీరంలో యాంటీబాడీలు (Antibodies) తయారవుతాయి. ఇవి వైరస్‌ను గుర్తించి దాన్ని ఎదుర్కోవడానికి రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. అయితే వైరస్  రూపాన్ని మార్చుకున్నప్పుడు, ఈ యాంటీబాడీలు దాన్ని గుర్తించే సామర్థ్యంలో కొంత మార్పు రావచ్చు.

అక్టోబర్ 2026లో ఓ అధ్యయనంలో LP.8.1కు అనుగుణంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన యాంటీబాడీలను ఉపయోగించి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో PJ.2.1 వేరియంట్‌ను కూడా యాంటీబాడీలు గుర్తించి ప్రభావాన్ని తగ్గించగలిగినట్లు తేలింది. అయితే LP.8.1 అనే రిఫరెన్స్ వేరియంట్‌తో పోలిస్తే PJ.2.1ను ప్రభావ సామర్థ్యం 1.8 రెట్లు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. మరో ప్రత్యేక అధ్యయనంలో XFG వేరియంట్‌కు అనుగుణంగా తయారైన వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా PJ.2.1ను ఎదుర్కొనే యాంటీబాడీలు పెరిగినట్లు నివేదించారు.

PJ.2.1 ఇప్పటికే ఏయే దేశాలకు వ్యాపించింది?
ఈ కొత్త వేరియంట్ కేవలం ఒక దేశానికే పరిమితం కాలేదు. పలు దేశాల్లో గుర్తించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటివరకు కెనడా, అమెరికా, స్పెయిన్,ఫ్రాన్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, ముఖ్యంగా కెనడాలోని అంటారియో దేశాల ప్రాంతంలో గుర్తించి ఈ వేరియంట్ వ్యాప్తిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

పబ్లిక్ హెల్త్ ఒంటారియో (Public Health Ontario) నవంబర్ 2, 2026న విడుదల చేసిన జన్యు పర్యవేక్షణ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 17 వరకు జన్యు పరీక్షలు చేసిన నమూనాల్లో PJ.2.1 వాటా 25.2 శాతంగా ఉంది. అంతకుముందు నాలుగు వారాల కాలంలో ఈ వేరియంట్ వాటా 16.9 శాతంగా మాత్రమే ఉంది. అంటే నాలుగు వారాల్లోనే గుర్తించిన నమూనాల్లో దీని వాటా గణనీయంగా పెరిగింది.

ఆ నివేదిక ప్రకారం, ఆ సమయంలో అంటారియోలో అత్యధికంగా గుర్తించిన వేరియంట్‌గా PJ.2.1 నిలిచింది. దీంతో ఈ వేరియంట్ ఎందుకు వేగంగా పెరుగుతోంది? దీని వెనుక ఉన్న జన్యుపరమైన మార్పులు ఏమిటి? రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందా? అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోలేదు. ఎప్పటికప్పుడు జన్యుపరమైన మార్పులు చేసుకుంటూ కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెందుతోంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త వేరియంట్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ నిర్లక్ష్యం చేయకూడదు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్‌పై నిరంతరం పరిశోధనలు చేస్తూ దాని వ్యాప్తి, తీవ్రత, వ్యాక్సిన్ల ప్రభావాన్ని గమనిస్తున్నారు.