హైదరాబాద్: మైనార్టీలు, దళితులు అభివృద్ధి చెందకుండా దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా భవన్లో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యావ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. దేశంలో విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుకు పునాదులు వేశారని, ఆయన కృషి ఫలితంగానే ఎంతోమంది ఇంజినీర్లుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు సత్తా చాటుతున్నారని అన్నారు. ఐటీఐల ఏర్పాటులోనూ ఆజాద్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.దేశంలో పేదల విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తోందని తెలిపారు. మైనార్టీ వర్గాల్లో ఎంతోమంది నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని, వారికి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మైనార్టీ యువత విద్యతో పాటు నైపుణ్య రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.
పేదలకు ఓటు హక్కు కల్పించడం బీజేపీకి ఇష్టం లేదని సీఎం విమర్శించారు. దేశంలో బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి, షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చి సముచిత గుర్తింపు కల్పించామన్నారు.
హైదరాబాద్‌ను ఓల్డ్ సిటీగా కాకుండా ఒరిజినల్ సిటీగా చూడాలని సీఎం అన్నారు. పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. నగర అభివృద్ధిలో భాగంగా మూసీ సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాదుల వల్లే దేశం విద్య, సాగునీటి రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతాయని, ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
