ఎల్ నినో ప్రభావం, వేసవిపై జలమండలి అప్రమత్తం.. హైదరాబాద్ లో తాగునీటి అవసరాలపై ఫోకస్..!

ఎల్ నినో ప్రభావం, వేసవిపై జలమండలి అప్రమత్తం.. హైదరాబాద్ లో తాగునీటి అవసరాలపై ఫోకస్..!

ఎల్ నినో ప్రభావం, రాబోయే వేసవి పరిస్థితుల పట్ల అప్రమత్తమయ్యింది జలమండలి. హైదరాబాద్ లో తాగునీటి అవసరాలపై ముందస్తు చర్యలు మొదలు పెట్టింది జలమండలి.సింగూరు, మంజీరా జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలతో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. బుధవారం ( నవంబర్ 11 ) గండిపేటలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పర్యటించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను పరిశీలించారు.

జంట జలాశయాల నుంచి అదనపు తాగునీటి సరఫరా అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెరిగే తాగునీటి డిమాండ్‌పై ముందస్తు కసరత్తు మొదలుపెట్టాలని అన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా ఎంత నీటిని సేకరించవచ్చనే అంశంపై పరిశీలన చేపట్టాలని.. అదనపు నీటి తరలింపునకు ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాల అన్వేషణ చేయాలని అన్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్ వ్యవస్థతో అనుసంధానంపై అధ్యయనం చేయాలని.. అదనపు నీటి సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాల పరిశీలించాలని అన్నారు. ఈ క్రమంలో నీటి లభ్యత, సాంకేతిక సామర్థ్యాలపై అధికారులతో చర్చించారు ఎండీ. అందుబాటులో ఉన్న ప్రతి జలవనరును సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. 

వేసవిలో నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం తదుపరి కార్యాచరణ రూపొందించనుంది జలమండలి.