ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ(PRP) అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ అనే నినాదంతో పుట్టిన ఈ పార్టీ ‘జనం కోసం.. జన హితం కోసం’ పనిచేస్తుందని విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. ఈ పొలిటికల్ పార్టీ లాంచ్ ఈవెంట్లో స్వర్గీయ నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి కూడా కనిపించారు.
తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి విజయసాయిరెడ్డి మరదలి కూతురు. అలేఖ్యా రెడ్డి తల్లి, విజయసాయిరెడ్డి భార్య అక్కాచెల్లెళ్లు. ఇలా విజయసాయిరెడ్డి కుటుంబంతో నందమూరి అలేఖ్యా రెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యా రెడ్డిని సొంత కూతురిలా ఆదరించి అక్కున చేర్చుకుంది.
తారకరత్నను కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న అలేఖ్యారెడ్డి, ఆమె పిల్లలకు విజయసాయిరెడ్డి కుటుంబం అండగా నిలిచింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అలేఖ్యా రెడ్డి పిల్లలను విజయసాయిరెడ్డి సొంత మనవరాళ్లుగా చూసుకుంటున్నారు. ఈ బంధుత్వం కారణంగానే పరివర్తన రాజనీతి పార్టీ లాంచ్ ఈవెంట్లో విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు నందమూరి అలేఖ్యా రెడ్డి, ఆమె పిల్లలు కూడా వేదికపై ఉన్నారు. పరివర్తన రాజనీతి పార్టీ ప్రకటించిన విజయసాయి ఆ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. తెలుపు, కాషాయ రంగులో పార్టీ జెండా ఉండగా, జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తు ఉండేలా చూసుకున్నారు.
