టెన్త్, ఇంటర్ తరగతి చదువుతున్న ICSE, ISC విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2027 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి (ICSE), 12వ తరగతి (ISC) బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15, 2027 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు కొనసాగుతాయి. ఇక ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 9న ప్రారంభమై ఏప్రిల్ 8, 2027 వరకు జరగనున్నాయి. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు సబ్జెక్టుల ప్రకారం పరీక్షల తేదీలు, సమయాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. టైమ్‌టేబుల్‌ను డౌన్లోడ్ చేసుకుని ముందుగానే పరీక్షలకు ప్లాన్ వేసుకోవడం మంచిది.
ఈసారి ఎంత మంది విద్యార్థులు
CISCE వివరాల ప్రకారం, 2027లో జరిగే టెన్త్, ఇంటర్ పరీక్షలకు కలిపి మొత్తం 3,79,980 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 10వ తరగతి ICSE పరీక్షలకు సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. ఈ పరీక్షలు 3,106 అనుబంధ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు నిర్వహించనున్నారు.
అలాగే 12వ తరగతి ISC పరీక్షలకు 1,10,025 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరు దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న మొత్తం 1,477 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. ఈసారి ICSEలో మొత్తం 76 సబ్జెక్టులు, ISCలో 60 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు
రాష్ట్రాల వారీగా చూస్తే, ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా (34,702) ISC విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ (30,235), ఉత్తరాఖండ్ (5,629), పంజాబ్ (5,479), జార్ఖండ్ (5,356), మహారాష్ట్ర (4,660), తమిళనాడు (3,572), కేరళ (3,491) కర్ణాటక (3,010) ఉన్నాయి.
అత్యధిక ICSE విద్యార్థులు ఉత్తర ప్రదేశ్ (51,168), పశ్చిమ బెంగాల్ (46,521), కర్ణాటక (33,417), మహారాష్ట్ర (31,035), పంజాబ్ (19,308), జార్ఖండ్ (17,201) రాష్ట్రాల నుండి ఉన్నారు.
ICSE 10వ తరగతి విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈసారి పరీక్షల సమయాల్లో మార్పు చేశారు. గతంలో ఉదయం 10:45 గంటలకు ప్రశ్నపత్రం చదివే సమయం ప్రారంభమయ్యేది. ఉదయం 11 గంటలకు సమాధానాలు రాయడం మొదలుపెట్టేవారు. కానీ 2027 పరీక్షల నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి.
*ప్రశ్నపత్రం చదివే సమయం – ఉదయం 10:00 గంటలకు.
*సమాధానాలు రాయడం ప్రారంభించే సమయం – ఉదయం 10:15 గంటలకు.
*పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిన సమయం – ఉదయం 9:45 గంటలలోపు.
*కాబట్టి విద్యార్థులు ఈ మార్పును తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి ఆలస్యం కాకుండా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
ALSO READ : JCBని ఎత్తి పడేసిన ఎద్దు.. వణికిపోతూ చూసిన జనం !
ISC 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు
*రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాం ధరించి పరీక్షకు వెళ్లాలి.
*ప్రైవేట్ అభ్యర్థులు స్కూల్ యూనిఫాం లేదా లేత రంగు దుస్తులు ధరించడం మంచిది.
*విద్యార్థులు పరీక్ష రాయడానికి అవసరమైన కొన్ని వస్తువులను మాత్రమే తమతో తీసుకెళ్లాలి.
*CISCE హాల్ టికెట్, బ్లు లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు, పెన్సిల్, స్కేలు, రబ్బరు, షార్పనర్, అవసరమైన సబ్జెక్టులకు కలర్ పెన్సిళ్లు, డ్రాయింగ్ పరికరాలు, అనుమతి ఉన్న కాలిక్యులేటర్లు తీసుకెళ్లవచ్చు.
పరీక్ష హాల్లోకి విద్యార్థులు తీసుకెళ్లకూడని వస్తువులు
పుస్తకాలు, నోట్స్, చీటీలు, స్కూల్ సంబంధించిన ఫొటోకాపీలు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ ఇయర్ఫోన్లు, వైర్లెస్ ఇయర్‌బడ్స్, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ రింగులు, కెమెరాలు, మైక్రోఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్, AI గ్లాసెస్, స్కానర్ పెన్నులు, రికార్డింగ్ పెన్నులు, పర్సులు, డబ్బులు, హ్యాండ్ బ్యాగులు,
పరీక్ష హాల్లో పాటించాల్సిన నియమాలు
*పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్థులు హాల్ నుంచి బయటకు వెళ్లకూడదు.
*ప్రశ్నపత్రంలో ఏవైనా తప్పులు ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి.
*ప్రశ్నపత్రం చదవడానికి 15 నిమిషాల అదనపు సమయం ఇస్తారు.
*ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాతే ప్రశ్నపత్రం సీల్ తెరవాలి.
*ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ముందు సూచనలన్నీ జాగ్రత్తగా చదవాలి.
*ప్రశ్నల్లో అడిగిన వాటికే సమాధానాలు రాయాలి.
ఆన్సర్ షీట్ రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
*ఆన్సర్ షీట్‌పై ప్రత్యేక గుర్తింపు నంబర్, ఇండెక్స్ నంబర్, సబ్జెక్ట్ వివరాలను సరిగ్గా రాయాలి.
*వివరాలు రాయడానికి బ్లు లేదా బ్లాక్ ఇంక్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి.
*ఆన్సర్ షీట్లో ఎక్కడ సంతకం చేయాలో అక్కడ మాత్రమే సంతకం చేయాలి.
*ఆన్సర్ షీట్ మొదటి పేజీ, హాల్ టికెట్ లేదా ప్రశ్నపత్రంపై అనవసరంగా రాయకూడదు.
*సమాధానాల మధ్య కొంత ఖాళీ వదిలి చక్కగా రాయాలి.
*ప్రశ్నలను మళ్లీ రాయకుండా ప్రశ్న నంబర్లను స్పష్టంగా పేర్కొనాలి.
*అవసరమైన చోట మాత్రమే పెన్సిల్‌తో బొమ్మలు, డయాగ్రామ్స్ వేయాలి.
10వ, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడు?
2027 సంవత్సరానికి సంబంధించిన ISC 12వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ లేదా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇచ్చిన వివరాల్లో పేర్కొన్నారు. ఫలితాల విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు CISCE వెబ్సైట్ https://cisce.org/ చూడాలి.
