నాగ్‌పూర్‌లోని బేసా ప్రాంతంలో ఇంట్లో జంట మృతదేహాలు కనిపించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. గడ్చిరోలి జిల్లాలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు దీపావళి పండుగకు నాగ్ పూర్ వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇద్దరి కాల్స్ కలవడం లేదు. కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉంది. మృతులను మనీష్ ప్రల్హాద్ గన్వీర్ (38), అతని భార్య సోనాలి గన్వీర్ (35)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ గడ్చిరోలి జిల్లాలోని సుర్జాగడ్లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వారు వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమని.. ఇద్దరూ కొన్ని నెలల క్రితమే కొత్త జీవితం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.
ఈ దంపతులు దీపావళి సందర్భంగా బేసా ప్రాంతంలోని రేవతి నగర్‌లోని తమ ఇంటికి వెళ్లారు. ఆదివారానికి ముందు రోజే మనీష్ కుటుంబ సభ్యులు బిహార్ వెళ్లిపోవడంతో దంపతులు ఒంటరిగా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో ఆ జంట మధ్య గొడవ జరిగినట్లు పొరుగువారు వినారని బెల్తరోడి పోలీసులు చెప్పారు. ఆ తర్వాత నుంచి ఇంటిలో నిశ్శబ్దం అలుముకుంది. గొడవకు, వారి మృతికి సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు.
కుటుంబ సభ్యులు పదే పదే ఫోన్ చేసినా కలవలేదు. దీంతో ఆందోళన చెంది ఒక బంధువును చూసి రమ్మని ఆదివారం పంపించారు. ఆ బంధువు ఇంటికి చేరుకున్నప్పుడు బయటి నుంచి తాళం వేసి ఉండడం గమనించాడు. అతను మొదటి అంతస్తుకు చేరుకుని కిటికీ ద్వారా లోపలికి చూసినప్పుడు దంపతులు కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. ఇంట్లో ఎలాంటి నోట్ లభించలేదు.
బెల్తరోడి పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి కారణాన్ని నిర్ధారించేందుకు దంపతుల మొబైల్ ఫోన్లను అన్ లాక్ చేసి కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక, ఫోన్ రికార్డులు దర్యాప్తుకు కీలకంగా మారనున్నాయని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
