భార్య మగాళ్లతో మాట్లాడితే అనుమానించటం క్రూరత్వం: జార్ఖండ్ హైకోర్టు

భార్య మగాళ్లతో మాట్లాడితే అనుమానించటం క్రూరత్వం: జార్ఖండ్ హైకోర్టు

రాంచీ: భార్య ఇతర మగాళ్లతో మాట్లాడితే అనుమానించటం మానసిక క్రూరత్వమే అవుతుందని జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన మేల్ ఫ్రెండ్స్‎తో ఫోన్‎లో మాట్లాడినంత మాత్రాన ఆమెకు వారితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం లింగ ఆధారిత మూస పద్ధతుల కిందకు వస్తోందని పేర్కొంది. భార్య ఇతర పురుషులతో మాట్లాడుతుందన్న అనుమానంతో ఆమెతో విడాకులు ఇప్పించాలని భర్త దాఖలు చేసిన పిటిషన్‎ను హైకోర్టు కొట్టివేసింది. 

2005, ఏప్రిల్ 30న ఓ వ్యక్తికి యువతితో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. భార్య తరచూ పురుష స్నేహితుడితో ఫోన్ మాట్లాడుతోందని, ఆమెకు అతడితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమె తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపించాడు. ఈ క్రమంలో తన భార్యతో విడాకులు ఇప్పించాలని బొకారోలోని బెర్మో ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్‏పై ఫ్యామిలీ కోర్టులో విచారణ మొదలైంది. భర్త చేసేవన్నీ నిరాధార ఆరోపణలు అని.. అత్తింటి వారు అదనపు కట్నం కోసం తనను వేధించారని భార్య వాదించింది. మేల్ ఫ్రెండ్‎తో ఫోన్‎లో మాట్లాడినంత మాత్రాన వివాహేతర సంబంధం ఉందనిఅనుమానించడం కరెక్ట్ కాదని తన వాదన వినిపించింది. రెండువర్గాల వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు భార్య వాదనలతో ఏకీభవించింది. 

►ALSO READ | ఆధార్ కార్డ్ వయస్సుకు సరైన రుజువు కాదు: మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‎ను కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును అతడు జార్ఖండ్ హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‎ను తిరస్కరించింది. ఈ సందర్భంగా జార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

మగ స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం  భార్య పట్ల మానసిక క్రూరత్వమేనని పేర్కొంది. ఒక మహిళ మరొక పురుషుడితో మాట్లాడినంత మాత్రాన ఆమె శీలాన్ని శంకించడం లేదా వివాహేతర సంబంధం అంటగట్టడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.