మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ కీలక తీర్పు వెలువరించింది. 'ఆధార్ కార్డును' కేవలం గుర్తింపు ధృవీకరణ పత్రంగానే పరిగణించాలి తప్ప.. అది సదరు వ్యక్తి వయస్సును నిర్ధారించే ఖచ్చితమైన రుజువు కాదని కోర్టు పేర్కొంది. పోస్ట్ మార్టం నివేదికలోని వైద్య పరీక్షల ఆధారంగా తేలిన వయస్సే మరింత నమ్మదగినదని హైకోర్టు తేల్చిచెప్పింది.
2019 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ బాలుడి ఆధార్ కార్డు ఆధారంగా అతని వయస్సును 14 సంవత్సరాలుగా పరిగణించి రూ.5 లక్షల 45వేలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. అయితే దీనిని ఇన్సూరెన్స్ కంపెనీ సవాల్ చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం బాలుడి వయస్సు 13 ఏళ్లేనని వాదించింది.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు విన్న జస్టిస్ అమిత్ సేత్.. ఇన్సూరెన్స్ కంపెనీ వాదనలో పస ఉందని అంగీకరించారు. ఆధార్ కార్డు కేవలం వ్యక్తిగత గుర్తింపు కోసం మాత్రమే ఉపయోగపడుతుందని, దాని ద్వారా కచ్చితమైన వయస్సును నిర్ధారించలేమని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో వైద్య నిపుణులు నిర్వహించే పరీక్షల ఆధారంగా వయస్సు నమోదు చేయబడుతుంది కాబట్టి.. అదే మరింత నమ్మదగినదని కోర్టు అభిప్రాయపడింది.
ఇదే సమయంలో బాలుడి వయస్సు ఆధారంగా నష్టపరిహార లెక్కల్లో మల్టిప్లైయర్‌ను కోర్టు సవరించింది. 15 ఏళ్ల లోపు పిల్లలకు '15' మల్టిప్లైయర్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా హైకోర్టు స్పష్టం చేసింది. బాలుడి నెలవారీ ఆదాయాన్ని కూలీల కనీస వేతనం ఆధారంగా రూ. 7వేల950గా నిర్ణయించింది. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం 50 శాతం మినహాయించి.. మల్టిప్లైయర్ లెక్కించి నష్టపరిహారాన్ని సవరించింది.
ALSO READ : డెబ్ట్ ఫండ్స్ vs లిస్టెడ్ బాండ్లు: ఏది బెటర్? ఎందులో టాక్స్ తక్కువ పడుతుంది?
తల్లిదండ్రులకు సంతాన నష్టం కింద రూ. 40వేల చొప్పున, అంత్యక్రియలకు రూ. 15వేలు, ఆస్తి నష్టం కింద మరో రూ.15వేలు కలిపి మొత్తం నష్టపరిహారాన్ని గతంలో ఉన్న పరిహారం రూ. 5 లక్షల 45వేల నుంచి రూ. 8లక్షల 25వేల 500కు పెంచుతూ తీర్పునిచ్చింది. అదనంగా పెంచిన మొత్తానికి పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుంచి వార్షికంగా 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఆధార్‌ను వయస్సుకు ఫైనల్ ప్రమాణంగా తీసుకోలేమంటూ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు న్యాయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
