వాట్సాప్‌లో త్వరలో భారీ మార్పులు! పేమెంట్స్, ఏఐ సేవలు, బుకింగ్స్ సహా అన్నీ ఒకే యాప్‌లోకి...

వాట్సాప్‌లో త్వరలో భారీ మార్పులు! పేమెంట్స్, ఏఐ సేవలు, బుకింగ్స్ సహా అన్నీ ఒకే యాప్‌లోకి...

వాట్సాప్ అంటే ఇప్పటివరకు మనకు గుర్తొచ్చేది మెసేజ్‌లు పంపుకోవడం, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం. కానీ ఇకపై వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్‌గానే కాదు... మన ప్రతిరోజు పనులను  కూడా వాట్సాప్‌లోనే   చేసుకునేలా కొత్త మార్పులు తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఈ విషయాలను వాట్సాప్ కొత్త గ్లోబల్ హెడ్ కునాల్ షా వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, రాబోయే రోజుల్లో వాట్సాప్‌లో మూడు ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. అవి కమ్యూనికేషన్, ఆర్థిక సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).

1. చాటింగ్‌  మరింత ఇంట్రెస్టింగ్ గా..
వాట్సాప్‌లో మనం రోజూ మెసేజ్‌లు పంపుకోవడం, వాయిస్ మెసేజ్‌లు పెట్టడం, గ్రూపుల్లో మాట్లాడుకోవడం, స్టిక్కర్లు, వీడియోలు షేర్ చేసుకోవడం వంటివి చేస్తుంటాం. ఇప్పుడు ఈ అనుభవాన్ని మరింత సులభంగా, సరదాగా మార్చాలని వాట్సాప్ భావిస్తోంది. కునాల్ షా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రతిరోజూ వాట్సాప్‌లో వెయ్యి కోట్లకుపైగా వాయిస్ మెసేజ్‌లు, 4 వందల కోట్లకు పైగా స్టిక్కర్లు పంపిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఫీచర్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వాయిస్ మెసేజ్‌లు, గ్రూప్ చాట్‌లు, స్టిక్కర్లు, వీడియోలకు సంబంధించి మరిన్ని ఫీచర్స్ తీసుకురావాలని కంపెనీ చూస్తోంది.

2. డబ్బులు ట్రాన్స్ఫర్ నుంచి రీఛార్జ్ వరకు 
వాట్సాప్ తీసుకురావాలనుకుంటున్న మరో ముఖ్యమైనది ఫైనాన్షియల్ సర్వీస్. సాధారణంగా మనం కరెంట్ బిల్లు కట్టాలన్నా, మొబైల్ రీఛార్జ్ చేయాలన్నా, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలన్నా ఒక్కో యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇకపై ఇలాంటి పనులను కూడా వాట్సాప్‌లోనే చేసుకునే విధంగా  కంపెనీ ఆలోచిస్తోంది. ఇప్పటికే భారత్‌లో వాట్సాప్ ద్వారా UPI పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్‌లు, కొన్ని టికెట్ బుకింగ్ సేవలు ఉన్నాయి. 

అంతేకాదు, భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ సహాయంతో కరెంట్ బిల్లులు, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ చెల్లింపులు వంటి సేవలను కూడా వాట్సాప్‌లోకి తీసుకొచ్చారు. 2026 సెప్టెంబర్‌లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా 30 రకాల విభాగాల్లో 22,722 బిల్లులు చెల్లించే సంస్థలకు యాక్సెస్ కల్పించారు. ఇక ముందు ఈ సేవలను మరింత విస్తరించాలని వాట్సాప్ భావిస్తోంది. అంటే భవిష్యత్తులో డబ్బులు పంపడం, బిల్లులు కట్టడం, రీఛార్జ్ చేయడం, అవసరమైన  సేవల కోసం పదేపదే వేర్వేరు యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం తగ్గవచ్చు.

3. AI సహాయంతో బుకింగ్స్, అపాయింట్‌మెంట్స్ కూడా  
వాట్సాప్‌లో రాబోయే మరో ఆసక్తికరమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). AI సహాయంతో యూజర్లు  రోజు ఉండే పనులను మరింత సులభంగా చేసుకునేలా ఫీచర్లు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

ఉదాహరణకు:
*మనకు అవసరమైన సమాచారాన్ని AI ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.
*బుకింగ్స్ చేసుకోవడంలో AI సహాయం పొందవచ్చు.
*డాక్టర్ అపాయింట్‌మెంట్స్ లేదా ఇతర ఏదైనా అపాయింట్‌మెంట్స్ మర్చిపోకుండా గుర్తుంచుకోవచ్చు.
*ప్రతిరోజు ఉండే పనులను ప్లాన్ చేసుకోవచ్చు.
*మనకు కావాల్సిన సమాచారాన్ని వెతకడం, అవసరమైన పనులను  చేయడం సులభమవుతుంది.
*ఇప్పటికే వాట్సాప్‌లో AI సేవలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, చిన్న వ్యాపారాల కోసం కస్టమర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఉత్పత్తులను సూచించడం, అమ్మకాలకు సహాయం చేయడం వంటి పనుల కోసం Meta Business AI సేవలను కూడా తీసుకొచ్చింది.

అయితే ఈ కొత్త AI ఫీచర్లన్నీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే విషయంపై కునాల్ షా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

4. ఇన్ని మార్పులు వచ్చినా ప్రైవసీకి ప్రాధాన్యత
వాట్సాప్‌లో పేమెంట్స్, AI సేవలు, ఇతర సౌకర్యాలు పెరిగితే మన పర్సనల్ డేటా పై భద్రత ఎలా ఉంటుందనే సందేహం చాలామందికి రావచ్చు. దీనిపై కునాల్ షా స్పందిస్తూ, వాట్సాప్‌లో ప్రతిరోజూ పది వేల కోట్లకు పైగా మెసేజ్‌లు, రెండు వందల కోట్లకు పైగా కాల్స్ జరుగుతున్నాయని తెలిపారు.

అయితే కొత్త సేవలు అందుబాటులోకి వచ్చినా వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంటే వ్యక్తిగత సంభాషణల గోప్యతను కాపాడటానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు.

5. అసలు ఈ కునాల్ షా ఎవరు?
కునాల్ షా భారతదేశానికి చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ వ్యాపారవేత్త. ఆయన CRED అనే ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీని స్థాపించారు. గతంలో వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా పనిచేసిన విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో కునాల్ షా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో వాట్సాప్‌ను కేవలం మెసేజింగ్ యాప్‌గా కాకుండా, ప్రజల ప్రతిరోజు  అవసరాలను తీర్చే ఒక పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనే ఆలోచన కనిపిస్తోంది. భారతదేశంలోనే వాట్సాప్‌కు 50 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అందుకే ఈ కొత్త మార్పులకు భారత్ చాలా ముఖ్యమైన మార్కెట్‌గా నిలుస్తోంది.

 వాట్సాప్ భవిష్యత్తులో కేవలం మెసేజ్‌లు పంపుకునే యాప్‌గా మాత్రమే ఉండకపోవచ్చు. మనకు వచ్చే బిల్లులు చెల్లించడం, డబ్బులు పంపుకోవడం, రీఛార్జ్‌లు చేయడం, బుకింగ్స్ చేసుకోవడం, అపాయింట్‌మెంట్స్ గుర్తుంచుకోవడం, AI సహాయంతో రోజువారీ పనులు పూర్తి చేసుకోవడం వంటి ఎన్నో సౌకర్యాలను ఒకే యాప్‌లో అందించాలనేది వాట్సాప్ కొత్త లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఇవన్నీ ప్రస్తుతం కంపెనీ పరిశీలిస్తున్న ప్రణాళికలు మాత్రమే. అన్ని కొత్త ఫీచర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై ఇంకా అధికారిక తేదీలు ప్రకటించలేదు. మొత్తానికి.. భవిష్యత్తులో మన చేతిలో ఉన్న వాట్సాప్‌తో చాటింగ్ చేయడమే కాదు, మన రోజు  పనుల్లో చాలా వరకు ఏక్కడి నుండైన  చేసుకునే రోజులు రావచ్చు!