దీపావళికి ప్రజలు టపాసులు కాల్చటం కరెక్టే.. పొల్యూషన్ దానంతట అదే తగ్గుతుందిలే: యోగి ఆదిత్యనాథ్

దీపావళికి ప్రజలు టపాసులు కాల్చటం కరెక్టే.. పొల్యూషన్ దానంతట అదే తగ్గుతుందిలే: యోగి ఆదిత్యనాథ్

దీపావళికి టపాసులు కాల్చడాన్ని ఎవరూ ఆపలేరని, పండుగ సంతోషం ముఖ్యం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాలుష్యం గురించి కొందరు అనవసర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని.. టపాసులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం దానంతట అదే తగ్గిపోతుందని చెప్పారు. ఒకపక్కన ప్రపంచం మెుత్తం పొల్యూషన్ పెరుగుతోంది, గాలి నాణ్యత రోజురోజుకూ తగ్గిపోతోందంటూ ఆందోళన చెందుతుంటే మరోపక్కన బీజేపీ నేతలు, యూపీ సీఎం యోగి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

అయోధ్యలో జరిగిన దీపావళి వేడుకల్లో తాను కూడా టపాసులు కాల్చినట్లు యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. జూనియర్ అసిస్టెంట్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ సమయంలో మాత్రమే కాలుష్యం గుర్తుకొస్తుందా అంటూ ప్రశ్నించారు. వ్యవస్థను భ్రష్టుపట్టించే అవినీతిపరుల గురించి ఎవరూ మాట్లాడరని.. కానీ ప్రజలు ఒక్క రోజు పండుగ చేసుకుని టపాసులు కాలిస్తే మాత్రం కొందరికి కాలుష్యం గుర్తుకొస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా 'ధూమ్-ధామ్' గా దీపావళి జరుపుకోవడం సంతోషకరమని, పండుగ పూట ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాలుష్యం ఏర్పడితే అది కొంతకాలానికి దానంతట అదే సర్దుకుంటుందని అభిప్రాయపడ్డారు.

సీఎం యోగి వ్యాఖ్యలకు మరోపక్కన దీపావళి తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా క్షీణించిందనే రిపోర్టులు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా దీపావళి వేళ దేశ రాజధాని ఢిల్లీలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా గాలి కాలుష్యం పెరిగింది. దిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 376కి పడిపోయి 'వెరీ పూర్' కేటగిరీకి చేరింది.

ALSO READ : ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కలకలం!

కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రధాన నగరాల్లోనూ గాలి నాణ్యత ఘోరంగా దెబ్బతింది. అధికారిక వివరాల ప్రకారం వారణాసిలో AQI 274కి, గోరఖ్‌పూర్‌లో 261కి, అలాగే లక్నోలో 245కి పడిపోయింది. చలికాలం ప్రారంభం కావడంతో పాటు బాణసంచా కాలుష్యం తోడవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పండుగ సంబరాలు ముఖ్యం అని ప్రభుత్వాలు అంటున్నా.. గాలి నాణ్యత వల్ల దెబ్బతింటున్న ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.