శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై బుధవారం (నవంబర్ 11) ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు కౌంటర్ అటాక్ మొదలుపెట్టాయి.
ముష్కరుల కాల్పులను ధీటుగా తిప్పికొట్టాయి. భద్రతా దళాల ఎదురు కాల్పులతో టెర్రరిస్టులు పారిపోయారు. ఈ దాడి గురించి సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి మరిన్ని ఆర్మీ బృందాలను తరలించారు. జవాన్లు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ముమ్మురంగా తనిఖీలు చేపట్టారు.
అధికారుల వివరాల ప్రకారం.. బుధవారం (నవంబర్ 11) మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఓ చెక్‌పాయింట్ వద్ద మోహరించిన సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందిపై మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లు గాయపడ్డారు. మధ్యాహ్నం 2.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగులు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
గాయపడిన జవాన్లను చికిత్స కోసం అనంతనాగ్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించినట్లు సీఆర్పీఎఫ్ తెలిపింది. ఈ దాడి గురించి సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి మరిన్ని బృందాలను తరలించారు. పరిసర ప్రాంతాలను సైన్యం ఆధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తోంది. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
