టెక్ దిగ్గజం లాజిటెక్ తన ఉద్యోగులకు అరుదైన అవకాశం కల్పించింది. వీడియో గేమ్స్ ఆడుకోవడం వృథా అనే అపోహను తొలగించేందుకు ముందుకు వచ్చిన ఆ సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సుమారు 7 వేల మంది ఉద్యోగులకు ఏడాదిలో ఎప్పుడైనా ఒక రోజు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గేమింగ్‌పై మక్కువ ఉన్న ఉద్యోగులు ఆ రోజు ఆఫీస్ పనికి దూరంగా తమకు నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చని క్రేజీ ఆఫర్ ఇచ్చింది.
వచ్చే ఏడాదిలో గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA VI) విడుదల కానున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసుకు లీవ్ పెట్టకుండా ఉండేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. 'లాగి గేమ్ డే' పేరుతో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా ఫుల్-టైమ్ ఉద్యోగుల నుంచి ఇంటర్న్‌ల వరకు అందరూ అర్హులే. ఉద్యోగులు ఈ సెలవును కేవలం జీటీఏ 6 విడుదల రోజే కాకుండా.. వచ్చే ఏడాది నవంబర్ నాటికి తమకు నచ్చిన ఏ రోజునైనా హాలిడే తీసుకోవచ్చని చెప్పింది సంస్థ.
గేమింగ్ అనేది సమయం వృథా చేయడం కాదని, ఇది ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచి పనితీరును మెరుగుపరుస్తుందని లాజిటెక్ సీఈఓ హన్నెకే ఫాబర్ పేర్కొన్నారు. సరైన విశ్రాంతి, ఆటలతో కూడిన విరామం వల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంగా.. కొత్త ఆలోచనలతో ఆఫీసుకు వస్తారని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎలైన్ లైర్డ్ తెలిపారు. కంపెనీ సీఈఓ ఫాబర్ నవంబర్ 19న లాజిటెక్ ఆఫీస్‌లో జరిగే గేమింగ్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు.
►ALSO READ | వాట్సాప్‌లో త్వరలో భారీ మార్పులు! పేమెంట్స్, ఏఐ సేవలు, బుకింగ్స్ సహా అన్నీ ఒకే యాప్‌లోకి...
జీటీఏ 6 లాంచ్ సమయంలో అమెరికాలో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకుండా లీవ్ తీసుకుంటారని, దీనివల్ల బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని కొన్ని అంచనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా చాలామంది గేమర్లు ఉద్యోగానికి సెలవు అడగకుండా సిక్ లీవ్ పెట్టి మరీ గేమ్స్ ఆడుతుంటారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ లాజిటెక్ కంపెనీ తన ఉద్యోగులకు అధికారికంగానే 'గేమింగ్ డే' సెలవు ప్రకటించడం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
లాజిటెక్ బాటలోనే అమెరికాలోని కొన్ని సైనిక విభాగాలు సైతం సైనికులకు ప్రత్యేక సెలవులు ప్రకటిస్తుండటం విశేషం. ఉద్యోగుల మానసిక ప్రశాంతతను, ఆసక్తులను గౌరవిస్తూ లాజిటెక్ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం కార్పొరేట్ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు దారితీస్తోంది.
