స్మార్ట్ ఫోన్ ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్‌కు ఈసారి దీపావళి పండుగ సీజన్ నిరాశను మిగిల్చింది. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్(AIMRA) విడుదల చేసిన దీపావళి రిటైల్ డేటా ప్రకారం.. పండుగ సమయంలో మొబైల్ సేల్స్ విలువ స్థిరంగా ఉన్నప్పటికీ.. హ్యాండ్‌సెట్ వాల్యూమ్ మాత్రం ఏకంగా 18 నుంచి 20 శాతం మేర క్షీణించింది. బలహీనమైన డిమాండ్, పెరుగుతున్న డివైజ్ ధరల కారణంగా మార్కెట్‌లో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వెల్లడైంది.
ధన్‌తేరాస్ నుంచి దీపావళి మరుసటి రోజు వరకు మెయిన్‌లైన్ రిటైల్ మార్కెట్లలో కొనుగోలుదారుల రాక బాగానే ఉన్నప్పటికీ.. పండుగ డిస్కౌంట్ల కోసం ముందువారంలో కొనుగోళ్లు సుమారు 40 శాతం పడిపోయాయి. ఎక్కువ శాతం రూ. 30వేల నుంచి రూ. 60వేల ధరల రేటు మధ్యలోని మెుబైల్స్ సేల్స్ నమోదైంది. ఆపిల్, మోటరోలా బ్రాండ్లు మంచి డిమాండ్ చూసాయి. పాత ఐఫోన్ మోడళ్లతో పాటు ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు మంచి ఆదరణ లభించింది. గూగుల్ పిక్సెల్ ప్రీమియం సెగ్మెంట్‌లో వేగంగా ఎదుగుతుండగా, షావోమి రెడ్మి నోట్ 17 సిరీస్‌తో స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. అయితే రియల్‌మీ బ్రాండ్ అమ్మకాలు మాత్రం 50 శాతానికి పైగా తగ్గటంతో తీవ్రంగా నష్టపోయింది.
ఈ సీజన్‌లో శాంసంగ్ కంపెనీ ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంది. గెలాక్సీ ఎస్25, ఫోల్డ్ 8 వంటి మోడళ్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటంతో రిటైలర్లు ఇబ్బంది పడ్డారు. ఆన్‌లైన్ ఛానెళ్ల కోసం కేటాయించిన డిస్కౌంట్ స్మార్ట్‌ఫోన్‌లను రిటైలర్లు నేరుగా అగ్రిగేటర్ల ద్వారా కొనుగోలు చేసి ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించడం గమనార్హం. చిన్న రిటైలర్లు.. ముఖ్యంగా రూ. 15వేల లోపు సెగ్మెంట్‌లో వ్యాపారం చేసేవారు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నారు. ప్రజలు కొత్త ఫోన్ల కొనుగోళ్లను వాయిదా వేయడం.. సెకండ్ హ్యాండ్, రెఫర్బిష్డ్ ఫోన్ల వైపు మొగ్గు చూపడం కనిపించింది.
ALSO READ : ఆధార్ కార్డ్ వయస్సుకు సరైన రుజువు కాదు
భవిష్యత్తులోనూ పరిస్థితి సవాలుగానే ఉండే అవకాశం ఉంది. మెమొరీ, విడిభాగాల ధరలు పెరగడంతో తయారీదారులు ధరలను మరో 15 శాతం వరకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెళ్ల మధ్య ధరల సమతుల్యతను పాటించాలని, సంప్రదాయ రిటైల్ భాగస్వాములకు ఫైనాన్సింగ్ సపోర్ట్ అందించాలని AIMRA డిమాండ్ చేస్తోంది. మొత్తంగా పెరిగిన ధరలు, ఈ-కామర్స్ ఆధిపత్యం చిన్న మొబైల్ వ్యాపారుల ఉనికికి సవాలుగా మారుతున్నాయి.
