మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ టాక్ షో హోస్ట్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 'మెగావర్స్ '(Megaverse) పేరుతో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సెలబ్రిటీ టాక్ షోను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. ఈ షోకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ షోలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ తో డార్లింగ్..
లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ ఈ ' మెగావర్స్ ' షోలో ప్రత్యేక అతిథిగా కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు ఈ ఎపిసోడ్ ను నవంబర్ 20, 2026న చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బుల్లితెరపై మెగాస్టార్, రెబల్ స్టార్ ను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం ఫ్యాన్స్ కు దక్కనుంది. చిరంజీవి తనదైన చమత్కారం, సరదా ప్రశ్నలతో డార్లింగ్ ను ఇంటర్వ్యూ చేస్తే ఆ సందడే వేరంటూ ఇప్పటికే ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.
స్టార్ గెస్ట్ లతో చిరు...
అయితే ఈ టాక్ షో కేవలం సినిమా ప్రమోషన్లకే పరిమితం కాకుండా.. నటీనటుల వ్యక్తిగత జీవితాలు, కెరీర్ లో ఎదురైన సవాళ్లు , అనుభవాలు, తెరవెనుక ఆసక్తికరమైన సంఘటనలకు ఇది వేదిక కానుంది. ఈ షోకు సంబంధించిన ఇప్పటికే బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి స్టార్ కమెడియన్లతో కొన్ని ఎపిసోడ్లు చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. అంతే కాదు కమల్ హాసన్ , కింగ్ అక్కినేని నాగార్జున, అఖిల్ లతో ప్రత్యేక ఎపిసోడ్లు కూడా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, రామ్ చరుణ్ లు కూడా ఈ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ షోపై ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.
ప్రభాస్ ఎపిసోడ్ లో ఏముంటుంది.?
మరో వైపు ప్రభాస్ ఈ షోలో పాల్గొంటే ఆయన నుంచి మెగాస్టార్ ఎలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించబోతున్నారో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బాహుబలి ప్రయాణం, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు, రాజమౌళితో అనుబంధం, పెళ్లి వంటి అంశాలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ గెస్ట్ అప్పీయరెన్స్ తో పాటు నవంబర్ 20 షూటింగ్ కు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ALSO READ : కనకదుర్గమ్మను దర్శించుకున్న నిర్మాత దిల్‌రాజు..
ఈ ' మెగావర్స్ ' షో ను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ ఎల్ పీ నిర్మిస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు అధికారిక లిస్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
