జియో, BSNLను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. బెస్ట్ హోమ్ ఇంటర్నెట్‌గా రికార్డ్: ఓపెన్‌సిగ్నల్

జియో, BSNLను వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. బెస్ట్ హోమ్ ఇంటర్నెట్‌గా రికార్డ్: ఓపెన్‌సిగ్నల్

టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ మరో ఘనత సాధించింది. ఓపెన్‌సిగ్నల్ విడుదల చేసిన నవంబర్ 2026 నివేదికలో ఎయిర్‌టెల్ భారత్‌లో 'బెస్ట్ హోమ్ ఇంటర్నెట్', 'బెస్ట్ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ హోమ్ ఇంటర్నెట్' అవార్డులను కైవసం చేసుకుంది. రిలయన్స్ జియో, BSNL వంటి దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి ఎయిర్‌టెల్ ఈ అరుదైన మైలురాయిని చేరుకుంది.

ఈ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ కనెక్షన్ల రిలయబిలిటీ, నిలకడైన నాణ్యత, డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్, వీడియో ఎక్స్‌పీరియన్స్ అనే 5 ప్రధాన విభాగాల్లోనూ ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలిచింది. ఓపెన్‌సిగ్నల్ అందించిన 100 నుంచి 1,000 పాయింట్ల స్కేల్‌లో ఎయిర్‌టెల్ ఏకంగా 486 పాయింట్లతో ఓవరాల్ రిలయబిలిటీలో 1వ స్థానంలో నిలిచింది. జియో 423 పాయింట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ 419 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ విభాగంలోనూ జియోతో జరిగిన పోరులో ఎయిర్‌టెల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ కన్సిస్టెంట్ క్వాలిటీలో ఎయిర్‌టెల్ 66.2 శాతం స్కోర్‌తో జియో 55% కంటే 11.2 శాతం ఆధిక్యంలో నిలిచింది. అంతేకాకుండా ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగం జియో కంటే 26 నుంచి 27 శాతం ఎక్కువ. ఫైబర్ నెట్‌వర్క్ అందనటువంటి ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ తన ఎఫ్‌డబ్ల్యూఏ సేవలను విస్తరిస్తూ వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందిస్తోంది.

ALSO READ : దీపావళికి ఘోరంగా పడిపోయిన స్మార్ట్ ఫోన్ సేల్స్.. 

మొత్తంగా ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్య కాలంలో సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇంటర్నెట్‌లో ఎలాంటి అంతరాయాలు లేకుండా వీడియో కాల్స్, స్ట్రీమింగ్ వంటి సేవలను వినియోగదారులు ఆస్వాదించడంలో ఎయిర్‌టెల్ బెస్ట్‌గా నిలిచింది. ఈ తాజా విజయంతో బ్రాడ్‌బ్యాండ్, హోమ్ ఇంటర్నెట్ మార్కెట్‌లో ఎయిర్‌టెల్ తన హవాను మరింతగా కొనసాగించనుందని నిపుణులు చెబుతున్నారు.