150 కోట్ల మంది దగ్గరలో మన దేశ జనాభా: ఎయిమ్స్ బోర్డు లెక్కలు

150 కోట్ల మంది దగ్గరలో మన దేశ జనాభా: ఎయిమ్స్ బోర్డు లెక్కలు

న్యూఢిల్లీ: భారత దేశ జనాభా వేగంగా 150 కోట్ల మార్క్‎కు చేరవవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన డిజిటల్ పాపులేషన్ క్లాక్ గణంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి బయట ఏర్పాటు చేసిన డిజిటల్ పాపులేషన్ క్లాక్ వీడియో నెట్టింట వైరల్‎గా మారింది. ఈ డిజిటల్ బోర్డులో భారతదేశ జనాభా 150 కోట్ల మార్కుకు వేగంగా చేరువవుతున్నట్లు కనిపించడమే వైరల్ కావడానికి ప్రధాన కారణం. 

2026, నవంబర్ 10 రాత్రి 7:27 గంటల సమయానికి భారతదేశ జనాభా 1,48,16,37,145 (సుమారు 148.16 కోట్లు) దాటినట్లు ఎయిమ్స్ బయట ఉన్న డిజిటల్ బోర్డుపై గణంకాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీంతో దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా, ఆ గణాంకాల కచ్చితత్వంపై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. 

పలువురు నెటిజన్లు డేటా ప్రామాణికత, ఖచ్చితత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి, మౌలిక సదుపాయాల కొరత, నీరు, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. 

పలువురు నిపుణులు ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. ఎయిమ్స్ వద్ద ఉన్న ఈ డిస్‌ప్లే బోర్డు దేశవ్యాప్తంగా జరిగే జనన, మరణాలను నేరుగా ట్రాక్ చేసే రియల్-టైమ్ వ్యవస్థ కాదని.. ఇది కేవలం సగటు జనాభా పెరుగుదల రేట్ల ఆధారంగా రూపొందించిన ఒక జనాభా అంచనా గడియారం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ కౌంటర్ చూపిస్తున్న గణాంకాలు ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ALSO READ : దాడులు చేయం.. పీస్ డీల్ కుదుర్చుకోం

భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అధికారికంగా జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరగా 2011లో దేశంలో జన గణన జరిగింది. అప్పుడు భారతదేశ జనాభా 121.1 కోట్లు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దేశ జనాభా ఎంత అన్న ఖచ్చితమైన అధికారిక డేటా లేదు. 2011 లెక్కలనే ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నారు 2026-27 దేశంలో జన గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ లెక్కల తర్వాత దేశ జనాభా ఎంత అన్నదానిపై ఒక క్లారిటీ రానుంది. వరల్డోమీటర్ ప్రకారం 2028 నాటికి భారతదేశ జనాభా 150 కోట్ల మార్కును దాటవచ్చు.