హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కీలక సంస్కరణలకు రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. 2027–28 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలో 10+2 విద్యా విధానం అమలు చేయాలని నిర్ణయించింది. 10+2 విద్యా విధానంపై MCRHRDలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా.. 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేక విద్యగా గుర్తించాలని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ విద్యకు ప్రాధాన్యం కల్పించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 10+2 అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 12వ తరగతి నుంచి స్కిల్స్పై ఫోకస్ పెడుతున్నామని సీఎం చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 12వ తరగతి వరకు విద్యార్థులను భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. 12వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అందులో నిపుణులుగా మారేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలన్నారు.
►ALSO READ | గడ్డం వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్
దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విధానమే అమలు చేస్తున్నారని, విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.
