బాలాసోర్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే లంచాలకు పాల్పడుతున్న ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాలో భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన మహిళా సబ్‌రిజిస్ట్రార్‌ను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బలియాపాల్లో సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రొబేషనరీ అధికారి మనీషా మిశ్రా ఓ భూమి కొనుగోలుదారుడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. ఒడిశా రెవెన్యూ సర్వీస్ (ORS) అధికారి అయిన మనీషా మిశ్రా 2024లో సర్వీసులో చేరారు. ఆమె అరెస్టు అయిన సమయంలో ఇంకా ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్నారు.
ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.7 వేల నగదు స్వీకరిస్తుండగా విజిలెన్స్ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని, ఆమెకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ప్రొబేషన్‌లో ఉన్న ఈ మహిళా అధికారిపై ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్నవారే లంచాల తీసుకుంటూ దొరికిపోవడం పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఎంత అవసరమో మరోసారి గుర్తుచేస్తోంది.
