ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధి తర్వాత దక్షిణాదికి ఒక కొత్త నాయకత్వం అవసరమైంది. సంక్షేమాన్ని, ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని, రాష్ట్రాల హక్కులను ఒకే దృష్టితో నడిపే నాయకత్వం అది. ఆ బాధ్యతను నిర్వహించే సామర్థ్యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే దక్షిణాది ప్రత్యేకత ఎలా పుట్టిందో, అది ఇప్పుడు ఎందుకు ప్రమాదంలో పడిందో తెలుసుకోవాలి. దక్షిణాది విశిష్టత భౌగోళిక అమరికతోనే మొదలవుతుంది.
మూడు వైపులా సముద్రం, పశ్చిమ– తూర్పు కనుమలు, మధ్యలో దక్కన్ పీఠభూమి ఇక్కడి ఆర్థిక గమనాన్ని నిర్ణయించాయి. శాతవాహనులు, పల్లవులు, చోళులు, పాండ్యుల కాలంలో ముజ్రిస్, మైలాపూర్, మోటుపల్లి రేవుల ద్వారా రోమన్ ప్రపంచంతో, ఆగ్నేయాసియాతో వాణిజ్యం సాగింది. హిమాలయ మంచు నదులు లేకపోయినా, వర్షాధార నదులను అనుకూలంగా మార్చుకుని కాకతీయులు గొలుసుకట్టు చెరువులను, చోళులు కల్లణై ఆనకట్టను నిర్మించారు. గ్రామం స్వయంసమృద్ధి ఆర్థిక యూనిట్‌గా నిలిచింది. ఆర్థిక బలానికి సామాజిక చైతన్యం తోడైంది.
భక్తి ఉద్యమం, బసవణ్ణ అనుభవ మంటపం సమానత్వ భావనకు పునాది వేశాయి. మైసూరు రిజర్వేషన్లు, జస్టిస్ పార్టీ, పెరియార్ ఉద్యమం, నారాయణ గురు, వీరేశలింగం, గురజాడ, భాగ్యరెడ్డి వర్మ, తెలంగాణ సాయుధ పోరాటం ఆ చైతన్యాన్ని రాజకీయ శక్తిగా మార్చాయి. హిందీ విధింపుపై పోరాటాలు భాషా ఆత్మగౌరవాన్ని చాటాయి. ఈ చైతన్యాన్ని పాలనగా మార్చినవారు ముగ్గురు. ఎంజీఆర్ 1982లో మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తృతంగా అమలుచేసి అక్షరాస్యతను, పిల్లల ఆరోగ్యాన్ని ఒకేసారి మెరుగుపరిచారు.
కరుణానిధి తమిళ ఆత్మగౌరవం, భాషా పరిరక్షణ, రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కోసం గళమెత్తారు. ఎన్టీఆర్ ఢిల్లీ నాయకత్వ పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగు ఆత్మగౌరవ నినాదంతో 1982లో రాజకీయ శక్తిగా ఎదిగారు. రెండు రూపాయల బియ్యం ఇచ్చారు, పటేల్– పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. 1986లో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. వీరి ఆత్మగౌరవ రాజకీయం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు రాజకీయ అవకాశాలను విస్తరించింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి
రేవంత్ ఒక పల్లె నుంచి వచ్చి, స్థానిక సంస్థల స్థాయి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు ఎదిగారు. ఆ క్షేత్రస్థాయి అనుభవమే ప్రజల సమస్యలపై ఆయనకు స్పష్టత ఇచ్చింది. ఒకవైపు హైదరాబాద్‌ను ఐటీ, ఫార్మా, ఏఐ కేంద్రంగా నిలుపుతూనే, మరోవైపు పల్లె ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్నారు. తెలంగాణ రైజింగ్-2047 రాష్ట్రాన్ని మూడు ఆర్థిక ప్రాంతాలుగా విభజించింది. నగరంలో సేవలు, సాంకేతికతకు ‘క్యూర్’, నగర పరిసరాల్లో తయారీ, లాజిస్టిక్స్‌కు ‘ప్యూర్’, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆహారశుద్ధి, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ‘రేర్’ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (ఆర్‌ఏఆర్‌ఈ).
ఇదే దక్షిణాదికి కొత్త గ్రామీణ నమూనా. ఇప్పటివరకు గ్రామీణ రాజకీయాలు రైతుకు సాయం చేయడం దగ్గరే ఆగాయి. రేర్ దాన్ని దాటి, పంట పండినచోటే నిల్వ, శుద్ధి, మార్కెటింగ్ నిర్మించి పంట విలువలో ఎక్కువ భాగం పల్లెలోనే నిలిచేలా చేస్తుంది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వ్యవసాయ మౌలిక వసతుల విస్తరణ ఈ వ్యూహంలో ప్రధాన భాగం. హైదరాబాద్ ఇంజిన్ అయితే, పల్లె ఉత్పత్తి కేంద్రం.
రాహుల్-రేవంత్ మోడల్
సంక్షేమం తక్షణ భద్రత ఇస్తే, రేర్ ఆ భద్రతను శాశ్వత ఆదాయంగా మారుస్తుంది. సామాజిక న్యాయంలో రేవంత్ దేశానికి మార్గం చూపారు. తెలంగాణలో సమగ్ర కులగణన చేపట్టి, ఈ నమూనాను జాతీయ స్థాయిలో ‘రాహుల్– రేవంత్ మోడల్’గా ముందుకు తెచ్చారు. కులగణన విధానానికి ఆధారం.. ఎవరు ఎంతమంది, ఎవరికి ఎంత అందింది, ఎవరు వెనుకబడ్డారు అనే వాస్తవాలు తెలిసినప్పుడే రిజర్వేషన్లు, బడ్జెట్ న్యాయంగా నిలబడతాయి. ఆ ఆధారంతోనే బీసీ రిజర్వేషన్‌ను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచే ప్రతిపాదన వచ్చింది.
అణగారిన వర్గాల్లోనూ అంతర్గత న్యాయం కోసం ముందడుగు వేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ ఉప వర్గీకరణను విద్య, ఉద్యోగాల్లో దేశంలోనే మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇది ముప్పై ఏళ్ల పోరాటానికి ముగింపు పలికింది. ఆరు గ్యారంటీల్లో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం గ్రామీణ మహిళల ఆర్థిక అవసరాలకు ఆసరా అయింది. ఈ పథకం ప్రారంభమైన నాటినుంచి వందల కోట్ల ఉచిత ప్రయాణాలు జరగడమే కాక, మహిళలు రూ. వేల కోట్లు ఆదా చేశారు. ఆర్టీసీలో మహిళల వాటా గణనీయంగా పెరిగింది. స్వతంత్ర అధ్యయనం కూడా రవాణా ఖర్చు గణనీయంగా తగ్గిందని, చదువు, ఆరోగ్యం, జీవనోపాధులకు అందుబాటు పెరిగిందని గుర్తించింది. ఆ ఆదా వల్ల అన్నింటికంటే ముఖ్యంగా స్త్రీల ఆత్మవిశ్వాసం పెరిగింది.
జనాభా ప్రాతిపదికనే పునర్విభజన జరిగితే...
రైతు భరోసా, రుణమాఫీని ఈ ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా, నిజంగా భూమిని సాగు చేసే రైతుకు చేర్చింది. రైతు భరోసా, రుణమాఫీ, గృహజ్యోతి, ఉచిత బస్సు కలిసి గ్రామీణ కుటుంబాల చేతిలో నికర ఆదాయాన్ని పెంచి, రేర్ వ్యూహానికి పునాదిగా నిలుస్తున్నాయి. దక్షిణాది హక్కుల విషయంలో రేవంత్ స్వరం మరింత కీలకం. ప్రస్తుతం లోక్‌సభలో తమిళనాడుకు 39, కర్నాటకకు 28, ఆంధ్రప్రదేశ్‌కు 25, కేరళకు 20, తెలంగాణకు 17, పుదుచ్చేరికి ఒకటి చొప్పున మొత్తం 130 స్థానాలు ఉన్నాయి.
పునర్విభజన జనాభా ప్రాతిపదికనే జరిగితే కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలే పార్లమెంటులో వాటా కోల్పోతాయి. దక్షిణాది ప్రాతినిధ్యం 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని రేవంత్ అసెంబ్లీలో తీర్మానం ద్వారా హెచ్చరించారు. సీట్లను 50 శాతం పెంచితే దక్షిణాదిలో 130 నుంచి 195కి, ఉత్తరాదిలో 413 నుంచి 621కి పెరుగుతాయని, ఈ అంతరం మరింత పెరుగుతుందని ఆయన లెక్కలతో చూపారు. పరిష్కారం కూడా చూపారు. జనాభాతోపాటు రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యాన్ని లెక్కలోకి తీసుకునే ‘హైబ్రిడ్ మోడల్’. ఇది కరుణానిధి నాటి రాష్ట్రాల హక్కుల పోరాటానికి కొనసాగింపు.
దక్షిణాది నాయకత్వ ఐక్యతకు మార్గదర్శకత్వం
రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది రాష్ట్రాల హక్కుల సాధనలోనూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 'ఇండియా కూటమి'ని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో దక్షిణాది రాష్ట్రాల మద్దతును పూర్తిస్థాయిలో కూడగట్టే దిశగా ఆయన ప్రయత్నిస్తున్నారు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల నాయకత్వ ఐక్యతకు రేవంత్ రెడ్డి సరైన మార్గదర్శకత్వం వహిస్తే... అది కాంగ్రెస్ పార్టీకి, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వానికి ఒక అదనపు శక్తిగా, అజేయమైన బలగంగా మారుతుందనడంలో సందేహం లేదు.
ఎంజీఆర్, ఎన్టీఆర్, కరుణానిధికి వేర్వేరు గుర్తింపులు ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఆ గుర్తింపులు కనిపిస్తున్నాయి. అవి, కులగణనతో సామాజిక న్యాయం, రేర్‌తో గ్రామీణ ఉత్పాదకత, డీలిమిటేషన్ పోరాటంతో దక్షిణాది ఫెడరల్ గళం. పల్లె ఉత్పాదకత, సామాజిక న్యాయం, ఫెడరల్ హక్కులు, దక్షిణాది రాజకీయ ఐక్యత వైపు కూటమిని నడిపించే దిగ్గజ నాయకత్వం రేవంత్ రెడ్డిదే.
- చనగాని దయాకర్,
టీపీసీసీ జనరల్ సెక్రటరీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
