- 14న స్పెషల్ గ్రామసభలు
- బడి బయటి పిల్లలు, బాల్య వివాహాలు, వేధింపులపై ఆరా
- టాప్–10 సమస్యలు గుర్తించి జీపీడీపీలో నిధుల కేటాయింపు
- ఏడాదిగా పెండ్లిళ్లు లేకుంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ గ్రామాలుగా గుర్తింపు
- బాధితుల పేర్లు, ఫొటోలు బయటపెట్టొద్దని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని పల్లెల్లో చిన్నారుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13న ఊరూరా బాలల స్థితిగతులపై క్షేత్రస్థాయి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్పెషల్ గ్రామసభ నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ థీమ్‌తో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి శాశ్వత కార్యాచరణ రూపొందించనున్నారు.
ఆవాసాల్లో సమగ్ర సర్వే..
ప్రత్యేక గ్రామసభకు ముందస్తుగా, చిన్నారుల స్థితిగతులపై సమగ్ర సర్వే జరగనుంది. వార్డు సభ్యులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, స్థానిక ఉపాధ్యాయులతో కూడిన 3 నుంచి 4 మంది సభ్యుల బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరిస్తాయి. బడి బయట ఉన్న పిల్లలు, చదువు మధ్యలోనే ఆపేసిన డ్రాపౌట్లు, బాలకార్మికులు, అనాథలు, ఒంటిరి తల్లిదండ్రులున్న పిల్లలు, దివ్యాంగులు, పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు, బాల్య వివాహాల ముప్పు పొంచి ఉన్నవారితోపాటు లైంగిక, శారీరక వేధింపులకు గురవుతున్న చిన్నారుల వివరాలను నిశితంగా ఆరా తీస్తారు. బాధితులైన పిల్లల పేర్లు, ఫొటోలు, వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టరాదని, సేకరించిన రికార్డులను పంచాయతీ కార్యదర్శి అత్యంత భద్రంగా ఉంచాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. ఎక్కడైనా తీవ్రమైన వేధింపులు, పోక్సో కేసులు వెలుగుచూస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
గ్రామసభల్లో టాప్–10 సమస్యలపైనే ఫోకస్..
ఈనెల 14న బడుల వేళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిన్నారుల సమక్షంలోనే ప్రత్యేక గ్రామసభలు జరగనున్నాయి. సర్వే ఆధారంగా గ్రామస్థాయిలో పిల్లలు ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన 10 సమస్యలను గుర్తించి సభ ముందుంచుతారు. ఈ గ్రామసభల్లో పిల్లలకే పెద్దపీట వేస్తారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమకు కావాల్సిన ఆట స్థలాలు, గ్రంథాలయాలు, రక్షణ తదితర అవసరాలను బాలబాలికలు, దివ్యాంగ పిల్లలు పెద్దల ముందు స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పుకునే అవకాశం కల్పిస్తారు. ఈ సభల్లో తీసుకున్న తీర్మానాలు కాగితాలకే పరిమితం కాకుండా, రాబోయే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో చేర్చి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు.
బాల్య వివాహ రహిత గ్రామాలుగా గుర్తింపు..
గడిచిన ఏడాది కాలంలో తమ ఊళ్లో ఒక్క బాల్య వివాహం కూడా జరగలేదని క్షేత్రస్థాయిలో నిర్ధారణ అయితే, ఆయా గ్రామాలను వేదికపైనే అధికారికంగా బాల్య వివాహ రహిత పంచాయతీగా ప్రకటిస్తారు. బాల్య వివాహాలను అడ్డుకుంటామని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు చెందిన నిర్ణయ్ పోర్టల్‌లో వీడియోలతో సహా అప్లోడ్ చేస్తారు. తీర్మానాల అమలు కోసం ప్రత్యేక యాక్షన్ ట్రాకర్ ఏర్పాటు చేయనుండగా, పంచాయతీ పరిధి దాటిన సమస్యలను ఎంపీడీవోలు ఇతర శాఖలకు పంపుతారు. ప్రతీ మూడు నెలలకోసారి పంచాయతీ సమావేశాల్లో వీటి పురోగతిని సమీక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
