- ఈ వానాకాలం సీజన్లో 1604 గంటల పాటు నడిచిన బీజీ కొత్తూరు మోటార్లు
- మూడు లిఫ్టుల ద్వారా 9 టీఎంసీలకు పైగా నీళ్లు లిఫ్ట్
- వైరా రిజర్వాయర్ సహా రెండు జిల్లాల్లోని 143 చెరువులకు గోదావరి జలాలు తరలింపు
- 7 మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు, 8 మండలాల్లో తాగునీటి కష్టాలకు చెక్
ఖమ్మం, వెలుగు: గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంట భూములకు మళ్లించేందుకు నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ఈ సీజన్ లో రైతులను ఆదుకుంది. ఎల్ నినో కారణంగా వర్షాభావం ఏర్పడడం, పంటలు నీరందక ఎండిపోయే దశకు చేరడంతో ఆఫీసర్లు సీతారామ మోటార్ల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోశారు. ప్రభుత్వ ఆదేశాలతో వృథాగా సముద్రంలోకి వెళ్తున్న నీటిని మళ్లించిఎత్తిపోతల ద్వారా కాలువల్లోకి మళ్లించి ఉమ్మడి జిల్లాలోని చెరువులు నింపారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25 వేల ఎకరాల పంటలకు జీవం పోశారు. మూడు ఎత్తిపోతలను ఉపయోగించడంతో పాటు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి నీటితో వైరా రిజర్వాయర్ ను కూడా నింపడంతో అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు టెయిల్ ఎండ్ భూములకు నీరందించేందుకు వీలైంది. మరోవైపు 8 మండలాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
మూడు ఎత్తిపోతలతో నీటి సరఫరా..
ఎల్ నినో ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 33 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. వీటిలో ఖమ్మం జిల్లాలో 17 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 మండలాలున్నాయి. భూగర్భ జలమట్టాలు పడిపోవడం, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు అడుగంటడంతో తాగునీటికి ఎద్దడి ఏర్పడే పరిస్థితి వచ్చింది. దీంతో గోదావరి జలాలను ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్ లో బీజీ కొత్తూరు వద్ద ఉన్న మోటార్లను మొత్తం 1,604 గంటల పాటు నడిపించి 9.088 టీఎంసీల గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి ఎత్తిపోశారు.
అలాగే వి.కె. రామవరం దగ్గర ఉన్న రెండో పంప్ హౌస్, కమలాపురం వద్ద ఉన్న మూడో పంప్ హౌస్ ద్వారా నీటిని వివిధ ప్రాంతాలకు తరలించారు. ఈ నీటితో ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు, సుజాతనగర్, వైరా, తల్లాడ మండలాల్లోని చెరువులకు ప్రయోజనం చేకూరింది. సాగర్ ఆయకట్టు కింద ఉన్న 123 చెరువుల కింద 11,965 ఎకరాలు, వైరా రిజర్వాయర్ కింద మరో 5 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 చెరువుల్లో నీటిని నింపి 9,436 ఎకరాల ఆయకట్టుకు అందించారు.
రూ.19 వేల కోట్లకు పెరిగిన అంచనా వ్యయం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రూ.13,380 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని గతేడాది రూ.19 వేల కోట్లకు పెంచారు. ఇప్పటి వరకు దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చుచేసి ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తిచేశారు. భూసేకరణ ఆలస్యంతో కొన్ని ప్యాకేజీల్లో పనులు పెండింగ్ ఉన్నాయి. రాజీవ్ లింక్ ద్వారా వైరా రిజర్వాయర్ కు నీటిని తరలిస్తున్నారు. సత్తుపల్లి లింక్ లో భాగంగా యాతాలకుంట టన్నెల్ నిర్మాణం ఇటీవల పూర్తయింది. ఈనెలాఖరు నాటికి ఈ టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇక పాలేరు లింక్ లో తిరుమలాయపాలెం మండలంలో టన్నెల్ పనుల పూర్తికి మరో ఏడాది పట్టే అవకాశముంది.
ముందస్తు ప్రణాళికతోనే చెరువులు నింపాం..
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ, కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాం. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేయటమే ప్రధాన లక్ష్యంగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాం. అందులో భాగంగానే సీతారామ ద్వారా గోదావరి జలాలను జలాశయాలు, చెరువులకు మళ్లించాం. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ నీటి నిల్వలను పెంచడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీంతో దాదాపు 25 వేల ఎకరాల్లో సాగునీటి అవసరాలు తీరి ఆయకట్టు స్థిరీకరణ అయింది. - (అంకిత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్)
