దేశంలోనే తొలి ఏఐ పీఎస్ పంజాగుట్ట.. ఫిర్యాదుల నుంచి ఛార్జిషీట్ వరకు అన్నీ ఏఐతోనే..

దేశంలోనే తొలి ఏఐ పీఎస్ పంజాగుట్ట.. ఫిర్యాదుల నుంచి ఛార్జిషీట్ వరకు అన్నీ ఏఐతోనే..
  • వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించనున్న డీజీపీ
  • సీపీ సజ్జనార్​ పోలీస్​ స్టేషన్​ ఆకస్మిక తనిఖీ  

పంజాగుట్ట, వెలుగు : దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌‌‌‌గా పంజాగుట్ట ఠాణా రూపుదిద్దుకుంటోందని నగర సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టు కింద పంజాగుట్ట పీఎస్​లో అన్ని సేవలను ఏఐతో లింక్​చేయనున్నట్టు ప్రకటించారు. దేశంలోనే మోడల్​స్టేషన్​గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. బుధవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌‌‌ను సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా స్టేషన్‌‌‌‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌‌‌‌లో పైలట్​ప్రాజెక్టు కింద ఏఐ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఏసీపీ మురళీకృష్ణ, ఇన్‌‌‌‌స్పెక్టర్ జహంగీర్‌‌‌‌తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎస్​లో ఏఐ సేవలను వచ్చే నెల మొదటి వారంలో డీజీపీ సీవీ ఆనంద్​ప్రారంభిస్తారని, ఇక్కడి ఫలితాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేస్తారని వివ‌‌‌‌రించారు. 

ఇప్పటికే పీఎస్​రిసెప్షన్ వద్ద ఏర్పాటు చేసిన ‘సేతు’ కియోస్క్ ద్వారా బాధితులు 10 భాషల్లో తమ ఫిర్యాదులు ఇవ్వొచ్చని, ఏఐ వాటిని స్థానిక భాషలోకి ట్రాన్స్​లేట్​చేసి క్షణాల్లో సంబంధిత అధికారులకు పంపుతుందని వివరించారు. ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు మొదలుకుని కేసు డైరీ, ఇన్వెస్టిగేషన్​రిపోర్ట్స్​, ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ తయారు చేయడం వరకు అన్నీ ఏఐ ఆధారంగానే సాగుతాయన్నారు. పంజాగుట్ట పరిధిలో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వ్యవస్థను మరింత సమర్థంగా నడిపిస్తామన్నారు.  

సీఐ జహంగీర్​పై సీపీ గుస్సా 

సీపీ సజ్జనార్​పంజాగుట్ట పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు తీరు, ఫిర్యాదుదారులతో సిబ్బంది ప్రవర్తన వంటి విషయాలపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. క్రైం రేట్, చిన్న తగాదాల విషయంలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సీఐ జహంగీర్​యాదవ్​ను మందలించినట్లు తెలిసింది.

రెండు రోజుల క్రితం స్వయంగా సీపీ జారీ చేసిన ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో తీరు మార్చుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం.