హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ లు డిమాండ్ చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం ఇటీవల 2 డీఎలను ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన నేతలు.. పెండింగ్ డీఏలను విడుదల చేయాలన్నారు.
నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీనుంచి వచ్చిన నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఈసీ మీటింగ్ లో చర్చించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లును రిలీజ్ చేయాలని కోరారు. ఎల్ నినో నేపధ్యంలో వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్నారు. నూతన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జనాబాతో సంబంధం లేకుండా 17 శాతం, 13 శాతం హెచ్ఆర్ఏను ఇవ్వాలన్నారు.
