బుడాపెస్ట్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్‌లో ఆకట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్ల బ్లిట్జ్ స్విస్‌లో అర్జున్ 5.5 పాయింట్లు సాధించి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద 4.5 పాయింట్లు సాధించాడు. వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఆడిన 9 గేమ్‌ల్లో ఐదింటిని గెలిచి, నాల్గింటిని డ్రా చేసుకుని ఏడు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
మాక్సిమ్ వాచియర్ లాగ్రావ్ (ఫ్రాన్స్, 6.5), లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా, 6) వరుసగా రెండు, మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఇండియా విమెన్స్ గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి.. వెస్లీ సో, హన్స్ నీమాన్‌పై గెలిచి నాలుగు పాయింట్లతో టోర్నీని ముగించింది.
