- లైన్మెన్లకు సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్వి. పాటిల్ ఆదేశం
- డ్రోన్ పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న 40 మందికి సర్టిఫికెట్లు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ల తనిఖీల్లో డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించాలని సదరన్ డిస్కమ్ సీఎండీ జితేశ్వి. పాటిల్ సిబ్బందిని ఆదేశించారు. డ్రోన్ల వినియోగాన్ని ఇంజినీర్లకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్లతో సహా అందరికీ అవకాశం కల్పించాలని సూచించారు. అర్రిసోల్ టెక్నాలజీస్, గోగ్ సర్వీసెస్ సహకారంతో డిస్కమ్ నిర్వహించిన మూడు రోజుల డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఇందులో దాదాపు 50 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా.. శిక్షణ పూర్తి చేసుకున్న 40 మందికి సీఎండీ సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా 1,136 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను డ్రోన్లతో సర్వే చేసినట్లు తెలిపారు. 1,050 కిలోమీటర్ల 11 కేవీ, 86 కిలోమీటర్ల 33 కేవీ లైన్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. మొత్తం 33,400 విద్యుత్ స్తంభాలు, 900 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను డ్రోన్ల ద్వారా పరిశీలించినట్లు వెల్లడించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సీఎండీ సూచించారు. డ్రోన్లు దెబ్బతింటాయనే భయంతో వాటి వినియోగానికి వెనుకాడొద్దని, చివరి స్థాయి ఉద్యోగి వరకు డ్రోన్లు వాడేలా స్వేచ్ఛ, ప్రోత్సాహం కల్పించాలని చెప్పారు.
