న్యూఢిల్లీ: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన, కీలక ప్లేయర్ల ట్రేడింగ్ జరిగింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారాడు. అందుకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్.. ముంబై జట్టులోకి వచ్చాడు. ఈ ట్రేడ్‌ను ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా హార్దిక్ కోసం పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్లు వెచ్చించింది. ముంబై తరఫున రూ. 16.35 కోట్లు అందుకున్న పాండ్యాకు ఈ ట్రేడింగ్‌తో మేలే జరిగింది. అర్ష్‌దీప్ వేతనం (రూ. 18 కోట్లు)లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. పంజాబ్ తరఫున ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. శ్రేయస్ పంజాబ్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ‘ట్రాన్స్‌ఫర్ ఫీజు అనేది రెండు ఫ్రాంచైజీల మధ్య కుదిరే ఒప్పందం. ఇది ఆటగాడికి ఫ్రాంచైజీ చెల్లించే రిటెన్షన్ ఫీజు కంటే భిన్నమైంది. హార్దిక్ ట్రేడింగ్‌కు సంబంధించి అతని విలువలో రూ. 1.65 కోట్ల పెరుగుదల ఉండాలని రెండు ఫ్రాంచైజీలు పరస్పరం అంగీకరించాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ అదనపు మొత్తంలో 50 శాతం పాండ్యాకు, మిగిలిన 50 శాతం ముంబై ఇండియన్స్‌కు చెందుతుంది’ అని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
నాలుగు టైటిల్స్‌తో..
తాజా ట్రేడింగ్‌తో ముంబైతో పాండ్యాకు రెండో విడత అనుబంధం కూడా ముగిసింది. గతంలో ఈ జట్టుతోనే అతను నాలుగుసార్లు టైటిల్స్ గెలిచాడు. 2015లో ముంబై ఇండియన్స్‌లో చేరిన 33 ఏళ్ల హార్దిక్... 2015, 2017, 2019, 2019లో టైటిల్స్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ నాలుగు సందర్భాల్లో తన బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముంబైకి ఏడు సీజన్లు ఆడిన తర్వాత 2022లో రూ. 15 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లాడు. తన కెప్టెన్సీతో తొలి సీజన్‌లోనే ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. 2023లోనూ ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే 2024లో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చిన పాండ్యా.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. కానీ తన వ్యక్తిగత పెర్ఫామెన్స్‌తో పాటు టీమ్‌ను నడిపించడంలో ఘోరంగా ఫెయిలయ్యాడు. దీనికి గాయాలు కూడా ఒక కారణంగా మారాయి. తొలి సీజన్‌లో ఫ్యాన్స్ నుంచి నిరంతరం హేళన ఎదుర్కొన్న పాండ్యా.. రెండో సీజన్‌లో కాస్త మెరుగుపడినట్లు కనిపించాడు. కానీ మూడో సీజన్ (2026) ముగిసే నాటికి పరిస్థితులు బాగా దిగజారిపోయాయి.
తిలక్ ఫ్యూచర్ కెప్టెన్..!
మూడో సీజన్‌లో పాండ్యాకు, ఇతర ప్లేయర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు కథనాలు వచ్చాయి. దాంతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా చెడిపోవడంతో ప్లేయర్ల ఆటతీరుపై ప్రభావం చూపింది. సూర్యకుమార్ యాదవ్, బుమ్రాతో సహా సీనియర్ ప్లేయర్లతో పాండ్యాకు పొసగలేదని వార్తలు వెలువడ్డాయి. రోహిత్‌ను అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తొలగించడం కూడా వివాదాస్పద అంశంగా మారింది. ప్రస్తుతం పాండ్యా లేకపోవడంతో మళ్లీ రోహిత్‌కు పగ్గాలు అప్పగించే చాన్స్ ఉంది. వైస్ కెప్టెన్సీ తిలక్ వర్మకు అప్పగించి.. భవిష్యత్ సారథిగా ప్రమోట్ చేయాలని ఏంఐ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ‘హార్దిక్ ముంబై ఇండియన్స్‌తో కొన్ని ప్రత్యేకమైన క్షణాలను కలిగి ఉన్నాడు. అతను ఒక క్రికెటర్‌గా ఎదగడం, వరల్డ్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేయడం, ఆపై జట్టుకు నాయకత్వం వహించడానికి తిరిగి రావడాన్ని కూడా చూశాం. ఒక క్రికెటర్‌గా, ఒక వ్యక్తిగా అతనిపై నాకు గౌరవం ఉంది. భవిష్యత్‌లో అతనికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించాడు.
నిఖార్సైన ఆల్‌రౌండర్..
గత సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలోనే విజయం సాధించింది. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో లీగ్ చివరి మ్యాచ్‌లకు హార్దిక్ దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ పాండ్యా ఓ నిఖార్సైన ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 162 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 142.68 స్ట్రయిక్ రేట్‌తో 2,955 రన్స్ చేశాడు. 82 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక బలమైన మ్యాచ్ విన్నర్‌గా తన విలువను చాటుకున్నాడు. మరోవైపు 2019లో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ 96 మ్యాచ్‌లు ఆడాడు. 111 వికెట్లతో ఫ్రాంచైజీ తరఫున టాప్‌లో నిలిచాడు. 2025లో 21, తర్వాతి సీజన్‌లో 14 వికెట్లు తీశాడు. టీమిండియా తరఫున 104 టీ20ల్లో 151 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.
